Share News

గ్రూప్‌-1లో వైసీపీ అడ్డంగా బుక్కయింది

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:31 AM

గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో వైసీపీ అడ్డంగా బుక్కయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

గ్రూప్‌-1లో వైసీపీ అడ్డంగా బుక్కయింది

  • తమవారికి ఉద్యోగాలిప్పించేందుకు అర్హులను బలి చేశారు

  • మండలిలో వైసీపీ రాద్ధాంతం చేస్తే దీటుగా ఎదుర్కొందాం.. మంత్రులతో సీఎం

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో వైసీపీ అడ్డంగా బుక్కయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలిచేశారన్నారు. గురువారం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం లంచ్‌ భేటీ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై వైసీపీని ఎండగడదామని మంత్రులు అనడంతో సీఎం పైవిధంగా స్పందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబుపత్రాలు దిద్దించడం ఏమిటని, పత్రికల్లో, చానళ్లలో వచ్చిన వార్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని మంత్రులు వివరించారు. గ్రూప్‌-1 అక్రమాల్లో నాటి వైసీపీ ప్రభుత్వం, అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరపాలని, మరికొంత మంది అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు. సిట్‌ నివేదిక కోర్టు పరిధిలో ఉండటంతో కోర్టు నిర్ణయం ఏమిటో చూద్దామని సీఎం అన్నారు. డీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, దీనిపై శాసనమండలిలో వైసీపీ రాద్ధాంతం చేయడానికి చూస్తే దీటుగా సమాధానం చెప్పాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో సహా కౌంటర్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘బురద చల్లుదాం.. ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకుందాం’’ అనే రీతిలో వైసీపీ నేతల తీరు ఉందని, దానికి పొలిటికల్‌ ఎటాక్‌ స్ట్రాంగ్‌గా ఉండకపోతే మరింత రెచ్చిపోతారని సీఎం పేర్కొన్నారు. కౌన్సిల్‌లో డీఎస్సీపై చర్చకు సిద్ధమని, ఆరోపణలు చేసేవారు ఆధారాలు తీసుకురావాలని సవాల్‌ చేయాలని మంత్రులకు సూచించారు.

Updated Date - Aug 14 , 2026 | 04:33 AM