అన్న చెప్పాడంటే అబద్ధాలే
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:18 AM
నోరు తెరిస్తే అబద్ధాలే అన్న సామెత జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. ఒకటో, రెండో అబద్ధాలు చెబితే పొరపాటని అనుకోవచ్చు. కానీ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు.
‘గ్రూప్-1’పై జగన్ మాటలన్నీ డొల్లే
కోర్టు తీర్పు, సిట్ నివేదిక వక్రీకరణ
మెయిన్స్ పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో 17 రోజుల తర్వాత సీసీటీవీల ఏర్పాటు
పరీక్షా కేంద్రంలో నిషేధమున్నా ఫోన్లు వాడారు
డిజిటల్ మూల్యాంకనం వద్దన్న న్యాయస్థానం
ఓఎంఆర్ స్లిప్పుల్లో సవరణలు చేసినట్లు సిట్ నిర్ధారణ
ఎగ్జామినర్‌కు తెలియకుండానే మార్కుల తగ్గింపు
తాను 99 మార్కులేస్తే.. ఎవరో 86కు తగ్గించారని సిట్ విచారణలో ఓ ఎగ్జామినర్ వెల్లడి
ఇవన్నీ వదిలేసి అక్రమాలే లేవంటూ జగన్ బుకాయింపు
వైపీపీ అధినేత అబద్ధాలకు ప్రభుత్వం కౌంటర్
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నోరు తెరిస్తే అబద్ధాలే అన్న సామెత జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. ఒకటో, రెండో అబద్ధాలు చెబితే పొరపాటని అనుకోవచ్చు. కానీ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. జగన్ జమానాలో జరిగిన గ్రూప్-1 పరీక్షల్లో ఆద్యంతం అక్రమాలు జరిగాయని, అడ్డగోలుగా మూల్యాంకనం చేశారని సిట్ నివేదికలో పేర్కొంటే.. ఆయన మాత్రం అంతా సక్రమమేనని వాదిస్తున్నారు. సిట్ నివేదికకు వక్రభాష్యం చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం జగన్ నిర్వహించిన రికార్డెడ్ ప్రెస్‌మీట్ ఆద్యంతం అవాస్తవాలతోనే సాగింది. మెగా డీఎస్సీలో లేని అక్రమాలు ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. 2018 గ్రూప్-1 అక్రమాలకు మాత్రం క్లీన్‌చిట్ ఇచ్చేశారు. దీనిపై వాస్తవాలను ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం సవివరంగా ‘మళ్లీ మళ్లీ అదే యాగీ’ శీర్షికన ప్రచురించింది. ప్రభుత్వం కూడా అధికారికంగా జగన్ ప్రెస్‌మీట్‌కు కౌంటర్ ఇచ్చింది. జగన్ అబద్ధాలతో దాడి చేసే ప్రయత్నం చేయగా.. శుక్రవారం ప్రభుత్వం వాస్తవాలతో ఎదురుదాడికి దిగింది. జగన్ చెప్పిన అసత్యాలు, ప్రభుత్వం చెప్పిన వాస్తవాలు...
సిట్ నివేదికను విస్మరించి...
జగన్: ఓఎంఆర్ స్లిప్పుల్లో నమోదైన మార్కుల్లో తేడాలు లేవని, జవాబు పత్రాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదని, మెరిట్ జాబితాలో పొరపాట్లు లేవని సిట్ పేర్కొంది.
ప్రభుత్వం: ఇది ఒక అపోహ. సిట్ నివేదికలో ఎర్రర్ లిస్టుకు సంబంధించిన ఒక పేరాను మాత్రమే తీసుకుని చూపించారు. ఓఎంఆర్ స్లిప్పుల్లో వ్యత్యాసాలున్నాయని సిట్ ఇచ్చిన నివేదికను కావాలనే విస్మరించారు. దర్యాప్తులో భాగంగా.. షార్ట్‌లిస్ట్ చేసిన 326 మంది అభ్యర్థుల వివరాలను సిట్ సేకరించింది. వాటిపై చేసిన విచారణలో వ్యత్యాసాలు గుర్తించింది. దీనిపై ఏపీపీఎస్సీకి లేఖ రాయగా.. 14 రకాల వ్యత్యాసాలను తాము గుర్తించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇదంతా వదిలేసి చివర్లో ఒక పేరాను తీసుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
మార్కులు మార్చారని ఎగ్జామినరే చెప్పారు కదా
జగన్: ఓఎంఆర్ షీట్‌లో సవరణలు ఎగ్జామినర్లే చేశారని, బయట వ్యక్తులు మార్చే అవకాశం లేదని సిట్ తేల్చింది.
ప్రభుత్వం: 16 ఓఎంఆర్ స్లిప్పుల్లో మార్పులు చేసినట్లు సిట్ గుర్తించింది. ధ్రువీకరణ లేకుండా ఈ మార్పులు జరిగాయి. నిబంధనల ప్రకారం ఆథరైజేషన్ వ్యక్తులు సంతకాలు చేయలేదు. దీనికి సంబంధించి ఎగ్జామినర్‌గా వ్యవహరించిన జి.సోమశేఖరను సిట్ విచారించింది. ఆయన దిద్దిన ఒక సమాధాన పత్రాన్ని చూపించింది. అందులో తాను 99 మార్కులు ఇచ్చానని, అయితే తన ప్రమేయం లేకుండా ఎవరో మార్కులను 86కు తగ్గించారని ఆయన తెలిపారు.
ఉల్లంఘనల సంగతేంటి?
జగన్: సవరణలు మూల్యాంకనంలో భాగమే.(దీనికి సంబంధించిన కంట్రోల్ బండిల్ స్లిప్‌ను జగన్ చూపించారు)
ప్రభుత్వం: సవరణలు మూల్యాంకనంలో భాగమే కానీ... వాటికి ఆఽథరైజేషన్ ఉండాలి. అనధికార వ్యక్తులు సవరణలు చేసినట్లు సిట్ గుర్తించింది. జగన్ నిబంధనల గురించి చెబుతున్నారు కానీ వాటి ఉల్లంఘనలను ప్రస్తావించట్లేదు. చేయకూడని వారు మార్పులు చేశారని, కొన్ని సవరణలకు సంతకాలు లేవని సిట్ దర్యాప్తులో తేలింది.
సీసీటీవీల సాక్షిగా అక్రమాలు
జగన్: గ్రూప్-1 మెయిన్స్ మాన్యువల్ మూల్యాంకనం సీసీటీవీల పర్యవేక్షణలోనే జరిగింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.
ప్రభుత్వం: మాన్యువల్ మూల్యాంకనం ప్రా రంభమైన 17 రోజుల తర్వాత సీసీటీవీలు ఏర్పా టు చేశారు. ఈ విషయాన్ని సిట్ నివేదికలో తెలిపింది. సీసీటీవీలు ఏర్పాటు చేసిన త ర్వాత కూడా నిషేధం ఉన్నప్పటికీ మూల్యాంక నం జరిగే కేంద్రంలో మొబైల్ ఫోన్లు వినియోగించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సీసీటీవీ ఫుటేజీలోనే దొరికాయి. సీసీటీవీలు ఉన్నాయని చెబుతున్న జగన్... సీసీటీవీల ద్వారా బయటపడిన అక్రమాలను కూడా అంగీకరించాలి.
ప్రభుత్వం గుర్తించిన మరిన్ని అవకతవకలు
ఓ హాల్ టికెట్‌కు సంబంధించిన పేపర్ ఎస్‌ఏఈ/108లో మొదటి మూల్యాంకనంలో 13 మార్పులు గుర్తించారు. గ్రాండ్ టోటల్‌ను 105 నుంచి 89కి అంకెల్లోనూ, అక్షరాల్లోనూ మార్చేశారు. ఈ మార్పులపై ఎలాంటి సంతకాలు చేయలేదు.
మరో అభ్యర్థికి చెందిన ఎస్‌ఏఈ/105 పేపర్‌లో ఐదు ప్రశ్నల్లో మార్పులు చేశారు. గ్రాండ్ టోటల్‌తో సహా మొత్తం ఎనిమిది మార్పులు చేశారు. మార్కులను 99 నుంచి 86కు తగ్గించారు. దీనిపైనా సంతకాలు లేవు.
మరో అభ్యర్థి పేపరు ఎస్‌ఏఈ/108లో కంట్రోల్ బండిల్ స్లిప్పులో మొదటి మూల్యాంకనంలో సం ఖ్యను 10ని 11గా ఓవర్‌రైట్(దిద్దారు) చేశారు. ఈ సవరణను ఆథరైజ్ చేస్తూ సంతకాలు చేయలేదు. మరో 11 సవరణల్లో రెండు చోట్ల సంతకాలు లేవు.
మరో ఎస్‌ఏఈ/102 పేపర్‌లో రెండో మూల్యాంకనంలో ఎగ్జామినర్, చీఫ్ ఎగ్జామినర్ ఒక్కరే అన్నట్టు చూపించారు. ఈ కంట్రోల్ బండిల్‌పై ఉన్న సంతకం వేరేలా ఉంది. ఇది నిబంధనలకు విరుద్ధం.
హైకోర్టు తీర్పునకు వక్రీకరణ
జగన్: డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబట్టలేమని హైకోర్టు చెప్పింది.
ప్రభుత్వం: ఇది తప్పుడు ప్రచారం. హైకోర్టు తీర్పులోని కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని దాన్ని వక్రీకరించారు. డిజిటల్ మూల్యాంకనం రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం చేపట్టాలని జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఏపీపీఎస్సీని ఆదేశించారు. ప్రస్తుత కేసుకు సంబంధించి కాకుండా భవిష్యత్తు పరీక్షలకు అన్ని అనుమతులతో చట్టబద్ధంగా డిజిటల్ మూల్యాంకనం నిర్వహించుకోవచ్చని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. జగన్ దీనిని వక్రీకరించారు. భవిష్యత్తు పరీక్షలకు చేసిన సూచనలను 2018 గ్రూప్-1కు అన్వయించే ప్రయత్నం చేశారు.