సౌరభ్ గౌర్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:13 AM
ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరోగ్యశాఖ కార్యదర్శిపై ప్రభుత్వం సీరియస్
వెంటనే జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశం
మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌కు
అదనపు బాధ్యతలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ
అడ్డగోలు నిర్ణయాలతో ఆరోగ్యశాఖకు అప్రతిష్ఠ
ఉద్యోగులతో దురుసు ప్రవర్తన.. తిట్లదండకం
అవినీతిమయంగా మారిన మెడికల్ కార్పొరేషన్
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గౌర్ స్థానంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనితో పాటు ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, డ్రగ్ డీజీ పోస్టుల అదనపు బాధ్యతలను కూడా సురేశ్ కుమార్ అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2002 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ గతేడాది సెప్టెంబరులో ఆరోగ్యశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచీ శాఖలో తాను చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు తిలోదకాలిచ్చి కంపెనీలకు ఇష్టారాజ్యంగా అర్డర్లు ఇచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హెల్త్ సెక్రటరీ, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, డ్రగ్స్ డీజీ పోస్టులను తనవద్దనే పెట్టుకున్నారు. ఆయా విభాగాల నుంచి తానే ఫైల్ పెట్టించడం, సెక్రటరీ హోదాలో ఆమోదించుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఆయన వ్యవహార శైలిపై ‘ఆరోగ్యశాఖకు అవినీతి క్యాన్సర్’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఒకవైపు ఏపీఎంఎస్ఐడీసీలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూనే, డ్రగ్స్ డీజీగా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. రెండు రోజుల క్రితం 23మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లను ఒకేసారి బదిలీ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై సీఎంకు గానీ, ఆ శాఖ మంత్రికి గానీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో బదిలీలపై బ్యాన్ ఉన్నా పట్టించుకోలేదు. ఇదే విషయమై ‘బదిలీల పేరుతో బేరాలు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిని ప్రభుత్వం అత్యంత సీరియ్‌సగా పరిగణించింది. గతంలో ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలతో పాటు ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరు కూడా సక్రమంగా లేదని గుర్తించి బదిలీ వేటు వేసింది.
సరెండర్ చేస్తా.. సస్పెండ్ చేస్తా..
ఉద్యోగులను భయపెట్టడంలో సౌరబ్ గౌర్‌ది అందెవేసిన చేయి. ‘సరెండర్ చేస్తా.. సస్పెండ్ చేస్తా’ అన్న పదాలు తప్ప ఆయన నోటి నుంచి మరో మాటే రాదు. తాను అనుకున్న కంపెనీలే టెండర్లలో ఎంపికయ్యేలా నిబంధనలు మార్చేస్తారు. ఏపీఎంఎస్ఐడీసీ (మెడికల్ కార్పొరేషన్) విభాగంలో అవినీతికి బాటలు వేశారన్న విమర్శలు వచ్చాయి. మెడికల్ కాలేజీల్లో అవసరం లేని వైద్య పరికరాలను రూ.కోట్లు ఖర్చుచేసి కొనుగోలు చేశారు. కొన్ని కంపెనీలకు మేలు చేసేందుకు తక్కువ ధరకు దొరికే పరికరాలను రెండు, మూడింతల అధిక ధరలకు కొనుగోలు చేశారు. కాగా, పిడుగురాళ్ల వైద్యకాలేజీలో ఆడ్మిషన్లకు ఎన్‌ఎంసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన హెచ్‌వోడీ అక్కడి లోపాలు, నిర్మాణ పనుల్లో జాప్యంపై మంత్రి కార్యాలయంతో పాటు సీఎంవోకి నివేదిక సమర్పించారు. దీంతో సౌరబ్ గౌర్ ఆగ్రహంతో ఊగిపోయారు. పనుల జాప్యంలో మెడికల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం ఉందని, అందుకే ఎన్‌ఎంసీ ఆడ్మిషన్లకు అనుమతివ్వడం లేదని అందులో పేర్కొనడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. నివేదిక సిద్ధం చేసిన అధికారికి ఫోన్‌చేసి తిట్లదండకం అందుకున్నారు. దాదాపు పావుగంట సేపు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆయన తీరుతో మనస్తాపం చెందిన ఆ అధికారి ఇదే విషయాన్ని సీఎంవో, మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటనతో సీఎంవో కూడా షాక్‌కు గురైంది. ఆయన తీరుపై నిఘా వర్గాలు, మంత్రి కార్యాలయం అనేకసార్లు హెచ్చరించాయి. జాగ్రతగా ఉండాలని సూచించాయి. కానీ సౌరబ్ గౌర్ తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ప్రభుత్వం ఆరోగ్యశాఖ నుంచి తప్పించింది.