ఉగాదికి మెగా ‘జాబ్ క్యాలెండర్’
ABN , Publish Date - Feb 24 , 2026 | 03:45 AM
ఉగాది నాటికి ‘మెగా జాబ్ క్యాలెండర్’ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెల్లడించారు.
గత రెండేళ్లలో కేజీబీవీల ఫలితాలు మెరుగు
ఇప్పుడు అడ్మిషన్లకు పోటీ
ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం
అసెంబ్లీలో లోకేశ్ వెల్లడి
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఉగాది నాటికి ‘మెగా జాబ్ క్యాలెండర్’ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జాబ్ క్యాలెండర్‌లోనే టీచర్ పోస్టులు కూడా ఉంటాయని తెలిపారు. గతేడాది మెగా డీఎస్సీలో భాగంగా ఇప్పటికే 16 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర కేజీబీవీల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆడ్మిషన్లు జరుగుతున్నాయని, ఇక్కడ చేరేందుకు విద్యార్థినులు పోటీపడుతున్నారని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో గత రెండేళ్లల్లో ఫలితాలు బాగా మెరుగుపర్చామన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమని, కేంద్రం 60 శాతం నిధులు ఇస్తే, రాష్ట్రం 40 రాష్ట్రం నిధులు కేటాయిస్తుందన్నారు. కేజీబీవీల్లో విధులు నిర్వహించే ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి జీతాలు పెంచాలన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం అందించే బడ్జెట్ పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని, దానికి కేంద్ర మంతి ధర్మేంధ్ర ప్రధాన్ స్పందించారని తెలిపారు. ఎన్‌టీఎ్‌సకు కేంద్రం ఒప్పుకోవాల్సి ఉందన్నారు. దాదాపు 11 వేల మంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఆంగీకరించిన తర్వాతనే జీతాలు పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హైకోర్టులో పిటిషన్ ఉందని, దానిపై కూడా సమీక్ష చేస్తామన్నారు. కేంద్రం పీఏబీ ఆమోదించిన తర్వాతనే జీతాలు పెంపును తాము బాధ్యతగా తీసుకుంటామన్నారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువ మొత్తంలో జీతాలు మన రాష్ట్రంలోనే చెల్లిస్తున్నామని, అయినా తాను కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ కలిసినప్పుడు కూడా బడ్జెట్ పెంచాలని కోరానని గుర్తుచేశారు. తొలుత ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి ఎంటీఎస్ అమలు చేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలో వచ్చే ఏడాది సాస్కీ పథకం కింద విజయనగరం పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక సదుపాయాలు, అదనపు భవనాల నిర్మాణానికి చర్యలు చేపడతామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో ఇంజనీరింగ్‌తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ విద్య కూడా అంతే కీలకమన్నారు.
5 శాఖల పద్దులకు ఆమోదం
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఐదు ప్రభుత్వ శాఖలకు బడ్జెట్ కేటాయింపులకోసం మంత్రులు ప్రతిపాదించిన డిమాండ్లను శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమం,మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖలు,వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖలకు నిధుల కోసం ప్రతిపాదించిన డిమాండ్లపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు వర్ల రాజా (పామర్రు), సత్యనారాయణ (పి.గన్నవరం), రామాంజనేయులు (ప్రత్తిపాడు), సత్యప్రభ (ప్రత్తిపాడు,), ప్రశాంతిరెడ్డి (కొవూరు), సౌమ్య (నందిగామ), బాలరాజు (పోలవరం), జగదీశ్వరి (కురుపాం), సోమిరెడ్డి (సర్వేపల్లి), అశోక్ (ఇచ్ఛాపురం), మాధవి (గుంటూరు పశ్చిమ), డి.పార్ధసారథి (ఆదోని), మహ్మద్ నజీర్ (గుంటూరు తూర్పు), విష్ణుకుమార్‌రాజు (విశాఖ నార్త్)లు మాట్లాడారు.