పరిధి దాటితే వాక్ స్వేచ్ఛకూ చెక్
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:59 AM
వాక్ స్వాతంత్య్రం అపరిమితమైన హక్కేం కాదని, దానికీ పరిమితులున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇతరుల హక్కులను ..
సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
అవసరమైతే చట్టం కూడా తెస్తాం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి.. వీడియో విడుదల
అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి) : వాక్ స్వాతంత్య్రం అపరిమితమైన హక్కేం కాదని, దానికీ పరిమితులున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇతరుల హక్కులను ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు సోషల్ మీడియా సైతం, చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు. దీనికోసమే రాష్ట్రంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీస్, లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో కలిసి పనిచేస్తూ.. సోషల్ మీడియాలో జరిగే నేరాలపై వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై బుధవారం ఆయన వీడియోను విడుదల చేశారు. వాక్ స్వాతంత్య్రం అంటే కించపరిచే స్వేచ్ఛ కాదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ‘‘సోషల్ మీడియా రోజువారీ జీవితంలో భాగంగా మారింది. మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇదో శక్తివంతమైన వేదిక. ప్రభుత్వాలను విమర్శించే హక్కు మీకుంది. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, మా నిర్ణయాలతో విభేదించే హక్కు కూడా మీకుంది. ఇదే ప్రజాస్వామ్యం. దాన్ని మేం స్వాగతిస్తాం. కానీ ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బ తీయడం, హింసను ప్రేరేపించడం వంటివి... రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ పరిధిలోకి రావు. ఇవి చట్ట ప్రకారం నేరాలు.’’ అని ఆయన వివరించారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందన్నారు. ‘‘చాలా మంది ఫేక్ ఖాతాల వెనుక దాక్కొని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం, వ్యక్తిగత దూషణలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళలను అత్యంత దారుణంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. చివరికి దేవుళ్లను, దేవతలనూ వదలడం లేదు. ఇవేవీ భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు రావు. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును మేం పూర్తిగా గౌరవిస్తాం. కానీ దారుణమైన తప్పుడు ప్రచారం, నేరపూరిత, సైబర్ వేధింపులు, ఒకరి పరువును ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయాలనే ప్రయత్నాలను వాక్ స్వాతంత్య్రం పేరిట సమర్థించడానికి వీల్లేదు.’’ అని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నేరానికి కులం లేదు..
’’నేరస్థులకు, నేరానికి కులం, మతం, రాజకీయ పార్టీలు ఉండవు. తప్పు చేసి...కులం, మతం, ప్రాంతం, రాజకీయాల వెనక దాక్కోలేరు. చట్టం ముందు ప్రతి పౌరుడూ సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపైనా చట్ట ప్రకారం చర్యలుంటాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ పోరాటంలో వారు ఒంటరులు కాదు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో దీనిపై ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. స్ర్కీన్ షాట్స్, లింక్స్, వీడియోలు లేదా ఏదైనా డిజిటల్ ఆధారాలతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తెస్తాం’’ అని ఆయన తెలిపారు.