Share News

అంగన్‌వాడీ లకు ఇండక్షన్‌ స్టవ్‌లు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:13 AM

కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్కులర్‌ ఎకానమీ దిశగా అడుగులు వేయడం అనే అంశాలు నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.

అంగన్‌వాడీ లకు ఇండక్షన్‌ స్టవ్‌లు

  • ఇప్పటికే 11 వేల స్టవ్‌లు పంపిణీ

  • నెలాఖరులోగా మిగిలిన 44 వేల కేంద్రాలకు

  • వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణంలో సత్వర చర్యలు

  • లక్ష్యానికి అనుగుణంగా మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణం: సీఎం

కాలుష్యం తగ్గించడం, స్వచ్ఛతను పెంచడం, వ్యర్థాలను సద్వినియోగం చేసుకుని సర్కులర్‌ ఎకానమీ దిశగా అడుగులు వేయడం అనే అంశాలు నిరంతర ప్రక్రియగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా చేపట్టే వివిధ కార్యక్రమాలు, పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, కాలుష్యం తగ్గించడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకునేలా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్‌ స్టవ్‌లు ఇస్తున్నామని, ఇప్పటికే మొదటి దశలో పట్టణ ప్రాంతాల్లో 11,400 ఇండక్షన్‌ స్టవ్‌లను పంపిణీ చేశామని చెప్పారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 44,346 కేంద్రాలకు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండక్షన్‌ స్టవ్‌ వల్ల నెలకు రూ. 247 మేర ఆదా అవుతోందని సీఎం చెప్పారు. వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణం విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న విశాఖ, గుంటూరు ప్లాంట్ల పనితీరుపై ఆరా తీశారు. కడప, కర్నూలు జిల్లాల్లో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లకు శనివారం శంకుస్థాపనకు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విజయవాడలోని ప్లాంట్ల నిర్మాణ ప్రారంభ ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఈ-ఆటోలు, కాంపాక్టర్స్‌, స్వీపింగ్‌ మెషిన్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెలాఖరులోగా ఈ-ఆటోలను, అక్టోబరు ఆఖరులోగా కాంపాక్టర్లను, స్వీపింగ్‌ మెషీన్‌లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మిద్దె తోటల విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. గోబర్దన్‌ ప్లాంట్లు, పాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ యూనిట్ల వంటి వాటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త (లెగసీ వేస్ట్‌) తొలగింపులో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని నిర్దేశించారు. ఈ ఏడాది ఆగస్టు, అక్టోబరు మాసాల్లో ఎస్టీపీ ప్లాంట్లను అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. మ్యాజిక్‌ డ్రెయిన్లను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ వర్చువల్‌గా పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:14 AM