Share News

2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

ABN , Publish Date - May 09 , 2026 | 03:47 AM

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి ఇళ్లు కూడా నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

  • పల్లెల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల పంపిణీ

  • లబ్ధిదారులు అంగీకరిస్తే ప్రస్తుత లే-అవుట్లలోనే

  • ఇబ్బందులు లేనిచోట్ల భూసేకరణ, సమీకరణ

  • వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడండి

  • కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి ఇళ్లు కూడా నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సంక్షేమ శాఖలు, రెవెన్యూ, హౌసింగ్‌, సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌... తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులు అంగీకరిస్తే.. వారికి ప్రస్తుతం ఉన్న లే-అవుట్లలోనే 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ప్రస్తుత లే-అవుట్లలో ఉండటానికి ఇష్టపడని వారికి ఇబ్బందులు లేని చోట్ల భూసేకరణ, అవసరమైతే ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో సమీకరణ చేసి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సంతృప్త స్థాయిలో జరగాలి. ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతం చేయాలి. అలాగే ఆగస్టు 15లోగా రాష్ట్రంలో 2.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి.. లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించాలి. డిసెంబరు కల్లా మరో 2.38 లక్షల ఇళ్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కట్టేవి కాకుండా కొత్తగా మరో 10 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేయనుంది. వాటన్నింటినీ 2027, డిసెంబరు నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న లే-అవుట్లలోని స్థలాలను గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చిందని, ఇప్పుడు వాటిని మార్చడానికి వీల్లేదని కలెక్టర్లు చెబుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సీసీఎల్‌ఏ జయలక్ష్మి స్పందిస్తూ.. లే-అవుట్లలో ఇళ్లు నిర్మించుకోని లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించి వారికిచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేయవచ్చని చెప్పారు. ఈ విషయాన్ని సీసీఎల్‌ఏ, సీఎస్‌ త్వరగా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.


ఆ ఇళ్లన్నీ క్రమద్ధీకరించాలి..

ప్రభుత్వ స్థలాలు, కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఒక్క విజయవాడలోనే 60 వేల మందికి, విశాఖపట్నంలో 30 వేల మందికి ఇళ్లను క్రమబద్ధీకరించి వారికి పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. క్రమబద్ధీకరణలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. గుంటూరులో 22ఏ కింద చాలా భూములున్నాయని, వాటిని త్వరగా క్లియర్‌ చేసి అర్హులకు కేటాయించాలని ఆదేశించారు. వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ 22ఏ భూ సమస్యలు పెండింగ్‌ ఉండకూడదన్నారు. కొత్త జిల్లాల్లో డీఆర్వోలు, ఆర్డీవో పోస్టులను భర్తీ చేయాలని, జిల్లా కార్యాలయాలకు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే... విద్య, వైద్యం, విద్యుత్తు ఖర్చుల భారాన్ని తగ్గించి పేదల జీవన ప్రమాణాలు పెంచాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి సోలార్‌ పవర్‌ ఓ గేమ్‌ ఛేంజర్‌ అని... ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీపై సోలార్‌ రూఫ్‌ టాప్‌లు ఇస్తున్నందున ఆ కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ విభాగంతో సమన్వయం చేసుకుని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించాలన్నారు. విద్యాశాఖ చక్కగా పనిచేస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు బాగా పెరిగాయని సీఎం ప్రశంసించారు. ఈ ఏడాది ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎంలో 150 నుంచి 200 వరకు రాష్ట్ర విద్యార్థులకు సీట్లు వస్తున్నాయని, వచ్చే ఏడాది కనీసం 500 మంది సీట్లు సాధించాలని చెప్పారు.


తాగునీటి సమస్య రానీయొద్దు

వేసవి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా తాగునీటి సమస్య తెలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు తగిన నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా కావాలని సమస్యలు సృష్టిస్తే కేసులు పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సత్యసాయిబాబా తాగునీటి ప్రాజెక్టులన్నింటికీ నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో సిమెంట్లు రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, చెత్త సేకరణ తదితర కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయని, త్వరలో గ్రామాలకు వైఫై సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పారు.

బుడగ జంగాల అంశంపై కేంద్రంతో చర్చిస్తా..

బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్‌ చాలా కాలంగా ఉందని, ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చే వరకు రాష్ట్రంలోని బుడగ జంగాలకు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తించే ప్రయోజనాలన్నింటినీ వారికి కూడా వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 09 , 2026 | 03:49 AM