Share News

టీచర్లకు ప్రత్యేక టెట్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:55 AM

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

టీచర్లకు ప్రత్యేక టెట్‌

  • డిసెంబరులో నిర్వహించాలని నిర్ణయం

అమరావతి, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేకంగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించే అవకాశం ఉంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఫైలు పెట్టింది. ఇటీవల టెట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యాయుల నుంచి డిమాండ్లు పెరిగాయు. రాష్ట్రంలో సుమారు 80వేల మందికిపైగా ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ అర్హత పొందాల్సి ఉంది. టీచర్లందరూ టెట్‌ అర్హత సాధించాల్సిందేనని గతేడాది సెప్టెంబరులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో పలు విద్యారంగ అంశాలపై ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, వేపాడ చిరంజీవి, కంచర్ల శ్రీకాంత్‌... సోమవారం విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను, పాఠశాల విద్య డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియాను వేర్వేరుగా కలిశారు. ఈ సమావేశాల్లో ప్రత్యేక టెట్‌కు సానుకూల నిర్ణయం వచ్చింది. కాగా.. ఇప్పటికే ఇచ్చిన టెట్‌ నోటిఫికేషన్‌లోనూ ఇన్‌ సర్వీస్‌ టీచర్లు దరఖాస్తు చేసుకుని టెట్‌ రాసుకోవచ్చు. గతేడాది చివర్లో నిర్వహించిన టెట్‌లో 15 వేల మందికిపైగా ఇన్‌ సర్వీస్‌ టీచర్లు టెట్‌ అర్హత సాధించారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించనున్నారు.

ఇకపై ప్రతినెలా ఫీజులు విడుదల

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై ప్రతినెలా రూ.200 కోట్లు చొప్పున నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నోటిఫికేషన్లలో గరిష్ఠ వయోపరిమితిని రెండు లేదా మూడేళ్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. కాంట్రాక్టు, మినిమం టైమ్‌ స్కేలుపై పనిచేస్తున్న టీచర్లకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 2003లో నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొంది 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలుకు ఇప్పటికే నిర్ణయం తీసుకోగా... త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీంతో 11వేల మంది టీచర్లకు మేలు జరుగుతుంది. గతేడాది బదిలీల్లో బదిలీ అయినా పాత స్థానాల్లోనే కొనసాగుతున్న 900 మంది టీచర్లను ఈనెలలో బదిలీ స్థానానికి పంపేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

మెగా డీఎస్సీ, ఇతర ఉద్యోగాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ ఆధ్వర్యంలో జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై వైసీపీ చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలింది. అయితే వైసీపీ మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం లేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ భావిస్తోంది.

Updated Date - Jun 16 , 2026 | 03:56 AM