Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్నెల్లలో న్యాయం

ABN , Publish Date - Jul 08 , 2026 | 03:53 AM

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఏపీసీఐడీ జప్తు చేసిన స్థిరాస్తులు వేలం వేసి..

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆర్నెల్లలో న్యాయం

  • ఆస్తుల వేలం ద్వారా చెల్లింపు.. ప్రత్యేక కోర్టుతో వేగంగా పరిష్కారం

  • మంత్రుల సమీక్షలో నిర్ణయం

  • 30 రోజుల్లో ఏజెంట్లు బాండ్లు ఇవ్వాలి.. మంత్రుల సమీక్షలో నిర్ణయం

  • వైసీపీ హయాంలో అగ్రిగోల్డ్‌ ఆస్తి పత్రాలు, భూ రికార్డులు మాయం

  • సీఐడీ దగ్గరున్న హార్డ్‌ డిస్క్‌లు సైతం: మనోహర్‌

  • అగ్రిగోల్డ్‌పై ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమీక్ష

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆరు నెలల్లో న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఏపీసీఐడీ జప్తు చేసిన స్థిరాస్తులు వేలం వేసి, సమకూరే డబ్బులను బాధితులకు చెల్లించేలా కసరత్తు మొదలు పెట్టింది. ప్రత్యేక కోర్టు ద్వారా కేసులు వేగంగా పరిష్కరించేందుకు సీఐడీ, లీగల్‌ విభాగం సమన్వయం చేసుకోవాలని, అగ్రిగోల్డ్‌ ఏజెంట్ల నుంచి నెల రోజుల్లో బాండ్లు సేకరించాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో అగ్రిగోల్డ్‌ సమస్యలపై మంత్రుల సబ్‌ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, రెవెన్యు మంత్రి అనగాని సత్యప్రసాద్‌, నాదెండ్ల మనోహర్‌ పాల్గొనగా, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. అగ్రిగోల్డ్‌ కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఏపీసీఐడీ జప్తు చేసిన వేల కోట్ల రూపాయల ఆస్తుల వేలం, ఏజెంట్ల నుంచి బాండ్ల సేకరణ తదితర ఎనిమిది అంశాలపై మంత్రివర్గం సమీక్షించింది. డిపాజిటర్లకు శాశ్వత పరిష్కారం అందించాలని, ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డిపాజిట్లు వీలైనంత త్వరగా చెల్లించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సమీక్ష అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం డిపాజిటర్ల వేదనను పట్టించుకోలేదన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం పరిరక్షించడం మాట దేవుడెరుగు కనీసం ఆస్తుల పత్రాలను కూడా రక్షించలేదన్నారు. అగ్రిగోల్డ్‌ భూముల రికార్డులన్నీ ధ్వంసం చేశారన్నారు. ఆఖరికి సీఐడీ అధికారుల వద్ద ఉన్న హార్డ్‌ డిస్కులను కూడా మాయం చేశారన్నారు.


డిపాజిటర్లకు ఇచ్చిన రూ.882 కోట్లలో కూడా వైసీపీ నాయకులు తప్పుడు పేర్లతో స్వాహా చేయాలని చూశారు. నిజమైన లబ్ధిదారులకు డబ్బులు చేరకుండా, దొంగ అకౌంట్లతో డిపాజిటర్ల సొమ్ము దిగమింగాలని చూశారని మంత్రి విమర్శించారు. 11.57 లక్షల మంది డిపాజిటర్లకు అతి త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని డిపాజిటర్లకు రూ.3944 కోట్లు రావాల్సి ఉందన్నారు. దీంతోపాటు సీఐడీ దర్యాప్తులో రూ.2 వేల కోట్లకు సంబంధించిన బాండ్లు ఏజెంట్ల వద్ద ఉండిపోయినట్లు తేలిందని చెప్పారు. 30 రోజులలోపు వారి వద్ద ఉన్న బాండ్లను స్వాధీనం చేసుకుంటామన్నారు. అగ్రిగోల్డ్‌కు 8 రాష్ట్రాల్లో 23,599 ఎకరాల భూములు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఆస్తులను పరిరక్షించి, కోర్టుల ద్వారా వేలం వేసి డిపాజిటర్లకు తగిన న్యాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యానికి, ప్రభుత్వానికి మధ్య ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవలే ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం, జడ్జితోపాటు 31పోస్టు లు మంజూరు చేసిందని మంత్రులు తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి మంత్రుల సబ్‌ కమిటీ భేటీ ఉంటుందని, కేసుల పురోగతి, పరిష్కారం మీద సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి మనోహర్‌ తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 03:54 AM