Share News

న్యాయశాఖ పటిష్ఠతకు చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 02:55 AM

రాష్ట్రంలో న్యాయశాఖ పటిష్ఠత కోసం ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

న్యాయశాఖ పటిష్ఠతకు చర్యలు

  • పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీపై మంత్రివర్గ ఉప సంఘం భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో న్యాయశాఖ పటిష్ఠత కోసం ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం(ఏపీ స్టేట్‌ పబ్లిక్‌ లిటిగేషన్‌ పాలసీ)ని పరిశీలించడానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం శుక్రవారం సచివాలయంలో భేటీ అయింది. మంత్రి ఫరూక్‌, హోంమంత్రి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఈ సమావేశంలో పాల్గొని న్యాయశాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్‌ మాట్లాడుతూ అనవసరమైన వ్యాజ్యాలను తగ్గించడానికి, వేగవంతంగా కేసుల పరిష్కారానికి, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, పరిపాలనా స్థాయిలో వివిధ పద్ధతులను సమీక్షించి మంత్రుల కమిటీ సూచనలు చేస్తుందన్నారు. ముందస్తు కేసు నిర్వహణ ద్వారా అప్పీళ్లను న్యాయంగా దాఖలు చేయడానికి, విధానపరమైన జాప్యాలను తొలగించడానికి మంత్రుల సంఘం చర్యలను సూచిస్తుందన్నారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని సమీక్షించడం, ప్రోత్సహించడం, లోక్‌ అదాలత్‌లను సంస్థాగతీకరించడం తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయశాఖను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లిటిగేషన్‌ పాలసీని పరిశీలించి, అక్కడ సంస్కరణలు ఇతర అంశాలను పరిశీలించి, రాష్ట్రంలో లిటిగేషన్‌ పాలసీని పటిష్ఠంగా అమలు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం న్యాయశాఖ అధికారులకు సూచించిందని మంత్రి చెప్పారు.

Updated Date - Apr 11 , 2026 | 02:55 AM