Share News

ఆక్వా దాణా ధరలపై అధ్యయనం

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:51 AM

రొయ్యల దాణా తయారీకివాడే ముడిసరుకుల ధరలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి రాష్ట్రస్థాయిలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి అచ్చెన్నాయుడు...

ఆక్వా దాణా ధరలపై అధ్యయనం

  • దాణా తయారీకి వాడే ముడి పదార్థాల ధరలపై కమిటీ

  • ఎంపెడా, సిబా, అప్సడా, రైతులు, దాణా కంపెనీలతో ఏర్పాటు

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా తయారీకివాడే ముడిసరుకుల ధరలను శాస్త్రీయంగా అంచనా వేయడానికి రాష్ట్రస్థాయిలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపెడా), కేంద్ర ఉప్పునీటి రొయ్యల పరిశోధన సంస్థ(సిబా), మత్స్య విశ్వవిద్యాలయం నుంచి ఒక్కొక్కరు, రొయ్యల దాణా తయారీదారులు, రొయ్యల రైతు సంఘాల నుంచి ముగ్గురు చొప్పున, ఏపీ ఆక్వా కల్చర్‌ అథారిటీ (అప్సడా) నుంచి ఇద్దరు, రొయ్యల దాణా డీలర్స్‌ అసోసియేషన్లు, మత్స్యశాఖ సాంకేతిక అధికారులు, రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ ప్రిన్సిపల్‌, ఆర్టీజీఎస్‌ నుంచి ఒక ప్రతినిధితో కమిటీని నియమించారు. రొయ్యల దాణా ముడి పదార్ధాల ఖర్చులు, తయారీ ప్రక్రియ, రవాణా, మార్కెట్‌ పోకడలు, నాణ్యతా ప్రమాణాలు, అన్ని సరుకుల ధరలతో మేత ధరలను ప్రభావితం చేస్తున్న కారణాలను ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. పౌల్ర్టీ రంగంలో అనుసరించిన సూత్రాల ప్రకారం ధరలను నిర్ణయించడం ద్వారా రొయ్యల రైతులకు, దాణా కంపెనీల యజమానులకు విధివిధానాల రూపకల్పనకు సూచనలు కోరింది. దాణా తయారీదారులు, రైతులు, డీలర్లు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలు, సూచనలు సేకరించడం, సాంకేతిక నిపుణులు, పరిశోధన సంస్థలను సంప్రదించి, దాణా పదార్థాల ధరల పోకడలను మూల్యాంకనం చేయడం, సహేతుకమైన, పారదర్శకమైన దాణా ధరల అంచనా యంత్రాంగాలను సిఫారసు చేయడం, డిజిటల్‌ యాప్‌తో దాణా ధరలను సమీక్షిస్తూ, కిలోకు రొయ్యల సగటును లెక్కించడం, దాణా ఆదా చేయడానికి మార్గాలు, రైతుల ప్రయోజనాలను రక్షించే పద్ధతులను సూచించడం, ప్రత్యామ్నాయ దాణా పదార్థాలపై పరిశోధన, అభివృద్ధి చేపట్టి, రొయ్యల దాణాలో చేర్చే అంశాలను సూచించాలని కమిటీకి ప్రభుత్వం నిర్థేశించింది.

Updated Date - Jun 16 , 2026 | 03:51 AM