గ్యాస్ సరఫరాలో బ్యాక్‌లాగ్స్‌కు వీల్లేదు
ABN , Publish Date - May 14 , 2026 | 05:10 AM
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, దీనికి ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని...
అక్రమాలకు పాల్పడితే అనుమతులు రద్దు
పెట్రోల్ బంకులపైనా నిఘా అవసరం: మంత్రి మనోహర్
తెనాలి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, దీనికి ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్‌లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి మంత్రి బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొంతమంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిపై ఆయా జిల్లా అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. అలాంటివారి అనుమతులను రద్దు చేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి బ్యాక్‌లాగ్స్ కనిపిస్తున్నాయని, ఇకపై గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4నుంచి 5రోజుల లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా సమస్యలు రెట్టింపవుతున్నాయని, అటువంటి వాటిని ఉపేక్షించేది లేదన్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరుతో పాటు మరికొన్ని జిల్లాల్లో గ్యాస్ బ్యాక్‌లాగ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించామని, కొందరు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర5 వేలకు పైబడి బ్యాక్‌లాగ్స్ పెండింగ్‌లో ఉండిపోయాయని తెలిపారు. పీడీఎస్ రైస్ అక్రమ తరలింపును అడ్డుకునే విషయంలో టాస్క్‌ఫోర్స్ బృందాల తీరు సంతృప్తికరంగా లేదన్నారు. కొందరు రేషన్ డీలర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జిల నుంచే బియ్యం పక్కదారి పడుతోందనే పక్కా సమాచారం ఉందని, వీటిపై టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు జరపాల్సిన అవసరం ఉందని తెలిపారు. అక్రమార్కులపై 6ఏ కేసులే కాకుండా పీడీ యాక్టులు నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. అధికారుల పని తీరును పర్యవేక్షించేలా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక మానిటరింగ్ సెల్ నిఘా ఏర్పాటు చేసినట్లు హెచ్చరించారు. కొన్ని డిపోల్లో నాణ్యత లేని సరుకుల పంపిణీ జరుగుతోందనే సమాచారం వస్తోందని, ఏ ఒక్క లబ్ధిదారు నుంచైనా ఫిర్యాదు అందితే బాధ్యులైన ప్రతి అధికారిపై చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు.