సాగునీటి కాలువల నిర్వహణకు 397 కోట్లు
ABN , Publish Date - May 16 , 2026 | 05:01 AM
రాష్ట్రంలో సాగునీటి కాలువల యాజమాన్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
జూన్ మూడో వారంలోగా మరమ్మతులు పూర్తి చేయాలి: నిమ్మల
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి కాలువల యాజమాన్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే సాగునీటి కాలువల నిర్వహణ కోసం రెండు దఫాలుగా రూ.709 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ఈ ఏడాది కాలువల మరమ్మతుల కోసం రూ.397 కోట్లు కేటాయించామన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సాగునీటి కాలువల యాజమాన్య నిర్వహణపై ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కాలువల్లో తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి పనులు చేపడుతున్నామన్నారు. వాటిని జూన్ మూడో వారానికల్లా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అత్యవసర పనులకు రూ.10 లక్షలు దాటితే.. కాలయాపన లేకుండా వారం రోజుల్లోనే టెండర్లు పిలిచేలా క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. మొత్తం పనుల్లో సుమారు 91 శాతం సాగునీటి సంఘాల ద్వారా చేపట్టాలని ఆదేశించామన్నారు. సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ప్రశాంతి, జల వనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.