Share News

పరిశ్రమలకు మరింత వేగంగా అనుమతులు

ABN , Publish Date - May 30 , 2026 | 05:34 AM

రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ వేగానికి అనుగుణంగా పరిపాలనను క్రమబద్ధీకరించి, మరింత సమర్థంగా పర్యవేక్షించడానికి..

పరిశ్రమలకు మరింత వేగంగా అనుమతులు

  • పెట్టుబడులను సాకారం చేయడమే లక్ష్యం

  • నిర్దేశిత గడువులోపు అనుమతులు

  • సింగిల్‌ డెస్క్‌ పాలసీకి సవరణ... ఉత్తర్వులు

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో వ్యాపార నిర్వహణ వేగానికి అనుగుణంగా పరిపాలనను క్రమబద్ధీకరించి, మరింత సమర్థంగా పర్యవేక్షించడానికి సింగిల్‌ డెస్క్‌ పాలసీ (2015)కి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో సిస్టమ్‌లో భాగంగా అనేక కొత్త సేవలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అన్ని రకాల క్లియరెన్స్‌ల కోసం పరిశ్రమల శాఖ కమిషనర్‌ నేతృత్వంలోని ఈ సింగిల్‌ డెస్క్‌ బ్యూరో ఏకైక సంప్రదింపుల కేంద్రంగా వ్యవహరిస్తుంది. జిల్లా స్థాయిలో డీఐపీసీకి బదులుగా జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ)లను ఏర్పాటు చేసింది. ప్రస్తుత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తాజాగా కొన్ని సవరణలు చేస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ తాజా సవరణల ప్రకారం.. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులను నిర్దేశిత గడువు లోపల ఇవ్వకపోతే సింగిల్‌ డెస్క్‌ బ్యూరోలోని అధికారులు పరిశీలించేందుకు పూర్తి అధికారాలు ఉంటాయి. పెట్టుబడిదారులకు అన్ని రకాల అనుమతులను నిర్దేశిత కాలపరిమితిలోగా ఇవ్వడానికి ఈ బ్యూరో మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఇందుకోసం ప్రతి వారం నిర్ణీత తేదీన పరిశ్రమల కమిషనర్‌ కార్యాలయంలో సమావేశమై సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ పనితీరులో పురోగతిపై బ్యూరో సమీక్ష నిర్వహిస్తుంది.


రెండు వారాలకోసారి బ్యూరో చైర్మన్ సమీక్ష నిర్వహిస్తారు. నెలకోసారి పరిశ్రమల శాఖ కార్యదర్శి, రెండు నెలలకోసారి పరిశ్రమల శాఖ మంత్రి, మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రస్తుత డీఐఈపీసీలు జిల్లా సింగిల్‌ డెస్క్‌ కమిటీలుగా పని చేస్తాయి. బ్యూరో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ(ఎస్ఐపీసీ)కి, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ)లకు నెలవారీ నివేదికలను సమర్పించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2026 | 05:35 AM