కలెక్టరేట్లలో సమాన స్థాయిలో ఉద్యోగులు
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:22 AM
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ 402) జారీ చేసింది. దీంతో ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో..
అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణ
మిగులు సిబ్బందిని సప్రెస్ చేస్తూ ఉత్తర్వులు
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ 402) జారీ చేసింది. దీంతో ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో కేడర్ పోస్టు సహా అంటే జిల్లా కలెక్టర్ సహా అధికారులు మొదలు చివరి పోస్టు అయిన వాచ్‌మన్ వరకు 85 మంది ఉంటారు. గతంలో ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మంది సిబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్తగా పోలవరం, మార్కాపురం జిల్లాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా 28 జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టులను సర్కారు పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ఇందులో 53 పోస్టుల్లో రెగ్యులర్ అధికారులు కాగా, 32 పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉంటారు. రాష్ట్రంలోని 28 జిల్లా కలెక్టరేట్ల పరిధిలో ఇక ఒకే విధమైన ఫార్మాట్‌లో అధికారులు, సిబ్బంది సంఖ్య ఉంటుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో కలెక్టరేట్ల పరిధిలో తహశీల్దార్లు వివిధ హోదాల్లో పనిచేసేవారు. ఇప్పుడు వారితోపాటు కొత్తగా డిప్యూటీ తహశీల్దార్లను కూడా తీసుకొచ్చారు. పెరుగుతున్న పనిభారాన్ని అధిగమించేందుకు తహశీల్దార్, డీటీల సేవలు కలెక్టరేట్లలో ఉండేలా ఉద్యోగుల ఫార్మాట్‌ను రూపొందించారు. దీని ఆధారంగా జిల్లాలకు అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేయాలని సీసీఎల్‌ఏను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కొత్తగా రెవెన్యూ డివిజన్, మండలాలకు కూడా అధికారులు, సిబ్బంది సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు (జీఓ 403) జారీ చేసింది). కొత్తగా ఏర్పాటుచేసిన ఒక్కో రెవెన్యూ డివిజన్‌కు 17 పోస్టులు, మండలానికి 11 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో పెద్దగా మార్పులేదు.
95 పోస్టులు సప్రెస్
సిబ్బంది పునర్వ్యస్థీకరణలో భాగంగా 95 పోస్టులను ప్రభుత్వం సప్రెస్ చేసింది. ఇందులో సీనియర్ అసిస్టెంట్లు 21, జూనియర్ అసిస్టెంట్లు 29, టైపిస్ట్ పోస్టులు 12 దాకా ఉన్నాయి. మరో 22 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు సప్రెస్ అయిన వాటిల్లో ఉన్నాయి. ఇవన్నీ అదనంగా ఉన్నందువల్లే సప్రెస్ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.