51 మంది వైద్యులకు ఉద్వాసన
ABN , Publish Date - May 07 , 2026 | 03:53 AM
భుత్వ వైద్యుల అనధికార సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ వారికి ఉద్వాసన పలికింది.
విధుల నుంచి శాశ్వతంగా తొలగింపు
మరో 33 మందికి చార్జి మెమోలు
త్వరలో ముగ్గురు ప్రొఫెసర్లపైనా చర్యలు
విధులకు గైర్హాజరీపై ప్రభుత్వం సీరియస్
బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించం: మంత్రి సత్యకుమార్
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యుల అనధికార సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ వారికి ఉద్వాసన పలికింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరంతా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారని, కొందరు ఆరేళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏడాదికి మించి విధులకు దూరంగా ఉన్నవారిని రాజీనామా చేసినట్లుగా భావించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. అయినప్పటికీ గైర్హాజరవుతున్న వైద్యులకు సంజాయిషీ నోటీసులు జారీచేసి తగిన సమయం ఇచ్చామని తెలిపారు. వారు స్పందించకపోవడంతో ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్‌ను అనుసరించి 51 మందికి ఉద్వాసన పలికినట్టు వివరించారు. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు.
సొంత వ్యాపకాలతో విధులకు డుమ్మా
ప్రభుత్వ నోటిఫికేషన్లను అనుసరించి బోధనాస్పత్రుల్లో రెగ్యులర్ విధానంలో విధుల్లో చేరినవారు.. ఎవరికీ చెప్పాపెట్టకుండా డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటివారు ఎక్కువగా ఉన్నారు. సొంత వ్యాపకాలు, పనులతో అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అందాల్సిన వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల నుంచి అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యుల వివరాలను తెప్పించుకున్నారు. నిబంధనలను అనుసరించి వారిని విధుల నుంచి తొలగించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లే అత్యధికం
ప్రభుత్వం తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా.. వారిలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యుడు.. 2020, ఫిబ్రవరి 7 నుంచి విధులకు హాజరు కావడం లేదు. అలాగే తొలగించిన 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో... కడప, అనంతపురం, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, మార్కాపురం కళాశాలలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఒకరు 2022 ఆగస్టు 22 నుంచి గైర్హాజరవుతున్నారు. అలాగే ప్రభుత్వం తొలగించిన ఇద్దరు ట్యూటర్లలో ఒకరు ఏకంగా ఏడేళ్ల నుంచి విధులకు దూరంగా ఉన్నారు. ప్రొఫెసర్లలో ముగ్గురు దీర్ఘకాలం నుంచి విధులకు హాజరు కావడంలేదు. వీరిపై కూడా త్వరలోనే కఠినచర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తం ఐదుగురు ప్రొఫెసర్లకు నోటీసులు జారీ చేయగా.. వారిలో ఇద్దరు విధుల్లో చేరారు. అలాగే ఏడాదికి మించకుండా విధులకు దూరంగా ఉన్నవారు 11 మంది ఉన్నారు. వీరికి కూడా డీఎంఈ అధికారులు చార్జి మెమోలు జారీ చేయగా.. వారంతా వచ్చి విధుల్లో చేరారు. చార్జి మెమోలు జారీచేసినా ఇంకా విధుల్లో చేరని వారిలో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. మరోవైపు జీరో వేకెన్సీ పాలసీ కింద వైద్యుల నియామకాలను వెంటనే చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు.