ఉద్యోగుల బకాయిల చెల్లింపులు ప్రారంభం
ABN , Publish Date - Apr 11 , 2026 | 02:56 AM
ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. రూ. 7 వేల కోట్లకు పైగా చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ...
రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాధాన్యం
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, సంఘాల నేతల హర్షం
అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. రూ. 7 వేల కోట్లకు పైగా చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుండగా, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని చెల్లింపుల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున ఏపీఎన్జీజీవో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటన విడుదల చేశారు. చెల్లింపు ప్రక్రియలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సీఎ్‌సలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, విజయవాడలోని ఎన్జీజీవో భవన్‌లో ఏపీ జేఏసీ చైర్మన్, ఎన్జీజీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్వీ్‌సలో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే చెల్లింపులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు.
ఉద్యోగులకు చెల్లింపులు ఇలా..
జీపీఎఫ్ బకాయిలు రూ. 1,880 కోట్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ రూ. 72 కోట్లు, ఏపీజీఎల్‌ఐ రూ. 79 కోట్లు, గ్రాట్యుటీ రూ. 3,600 కోట్లు, సరెండర్ లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్ రూ. 1,800 కోట్లు, పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్ బకాయిలు రూ. 236 కోట్లు, మెడికల్ బిల్లులు, ఇతర పద్దుల చెల్లింపులు మొత్తం కలిపి రూ. 7000 కోట్లకుపైబడి కొనసాగుతున్నాయని విద్యాసాగర్ తెలిపారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్లన్లీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నామని, వాటికి పరిష్కారం చేసే దిశగా ఏపీ ఎన్జీజీవో సంఘం, ఏపీ జేఏసీ ప్రయత్నం కొనసాగిస్తాయని తెలిపారు.
సీఎం సానుకూల స్పందన: బొప్పరాజు
ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తుండటం పట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి కేశవ్‌కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు చెప్పారు. మొత్తం రూ. 6,979 కోట్లు విడుదల చేశారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల బిల్లులను ప్రాధాన్యమిచ్చి మొదటగా చెల్లించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. పెన్షనర్లతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు కూడా పూర్తిగా విడుదల అయ్యేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.