Share News

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ప్రభుత్వ పోస్టుల విభజన

ABN , Publish Date - May 15 , 2026 | 04:03 AM

రాష్ట్రపతి జారీచేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల నిర్వహణ, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ ఉత్తర్వులు-2025 ప్రకారం.. వివిధ స్థానిక క్యాడర్లు, జిల్లాల్లో...

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే ప్రభుత్వ పోస్టుల విభజన

  • జిల్లాల్లో సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల వివరాలివ్వండి

  • కార్యదర్శులకు సీఎస్‌ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు

  • జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ క్యాడర్ల కిందకు ఏయే పోస్టులు వస్తాయో వివరణ

  • సచివాలయ సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తించవు

  • హెచ్‌వోడీ, రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు కూడా

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి జారీచేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల నిర్వహణ, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ ఉత్తర్వులు-2025 ప్రకారం.. వివిధ స్థానిక క్యాడర్లు, జిల్లాల్లో సివిల్‌ సర్వీసెస్‌, ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను విభజించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా క్యాడర్‌, జోనల్‌ క్యాడర్‌, మల్టీజోనల్‌ క్యాడర్‌ కిందకు ఏయే పోస్టులు వస్తాయో వివరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాల్లో సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల వివరాలివ్వాలని కోరారు. ప్రభుత్వం అవసరమని భావిస్తే.. ఈ జీవో ప్రకారం విభజించిన ఏవైనా రెండు కేటగిరీలకు చెందిన పోస్టులను ఏ శాఖలోనైనా లేదా సంస్థలోనైనా.. రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్కపక్కనే ఉన్న జిల్లాలు లేదా జోన్లను కలిపి ఒకే క్యాడర్‌గా నిర్వహించే అధికారం దానికి ఉంటుంది.

జిల్లా క్యాడర్‌ పరిధిలోకి వచ్చే పోస్టులు..

జూనియర్‌ అసిస్టెంట్‌, దానికి సమానమైన కేటగిరీలోని అన్ని పోస్టులు.. జూనియర్‌ అసిస్టెంట్‌ కంటే తక్కువ స్థాయిలోని అన్ని కేటగిరీల పోస్టులు.. జూనియర్‌ అసిస్టెంట్‌, అంతకంటే తక్కువ స్థాయి పోస్టుల వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం ఉన్న అన్ని పోస్టులు.. ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాసబార్డినేట్‌ సర్వీసె్‌సలోని అన్ని కేటగిరీల పోస్టులు.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ శాఖ పరిధిలోనైనా వీటికి సమానమైన ఉపాధ్యాయ పోస్టులు.. స్థానిక సంస్థలు, ఇతర యాజమాన్యాల పరిధిలో ఉంటూ, పైన పేర్కొన్న అంశంలోని సర్వీసులతో సమానమైన వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం కలిగిన అన్ని కేటగిరీల ఉపాధ్యాయ పోస్టులు.


జోనల్‌ క్యాడర్‌ పరిధిలోకి వచ్చేవి..

జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీ కంటే పైన ఉండి.. సూపరింటెండెంట్‌ కేటగిరీ వరకు ఉండే అన్ని పోస్టులు, వాటికి సమానమైన అన్ని కేటగిరీల పోస్టులు.. ప్రతిశాఖలోని మొదటి స్థాయి గెజిటెడ్‌ పోస్టు కేటగిరీ, జూనియర్‌ అసిస్టెంట్‌ కంటే ఎక్కువ వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం కలిగి ఉన్న ప్రతిశాఖలోని సూపరింటెండెంట్‌ కేటగిరీ వరకు ఉన్న అన్ని పోస్టులు.. అలాగే మొదటిస్థాయి గెజిటెడ్‌ కేటగిరీకి సమానమైన వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం ఉన్న అన్ని పోస్టులు.

మల్టీజోనల్‌ క్యాడర్‌ పోస్టులు..: సూపరింటెండెంట్‌ కేటగిరీ కంటే పైన.. మొదటిస్థాయి గెజిటెడ్‌ పోస్టుల కేటగిరీ కంటే పైన ఉండి, డిప్యూటీ కలెక్టర్‌ కేటగిరీ వరకు ఉన్న అన్ని పోస్టులు.. అలాగే ఇతర శాఖల్లోనూ వీటికి సమానమైన అన్ని పోస్టులు.. సూపరింటెండెంట్‌ కంటే ఎక్కువ వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం కలిగి ఉండి, ప్రతి శాఖలోనూ రెండవ స్థాయి గెజిటెడ్‌ కేటగిరీల నుంచి డిప్యూటీ కలెక్టర్ల వేతన స్కేలు లేదా నిర్ణీత వేతనం ఉన్న అన్ని పోస్టులు.

Updated Date - May 15 , 2026 | 04:04 AM