అరుణ మహా డేంజర్!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:54 AM
బెదిరింపులు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మోసం, ఫోర్జరీ, ఆస్తుల నష్టం వంటి కేసుల్లో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో ఉన్న నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ ఎత్తేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘పీడీ’ రద్దు కుదరదు
తల్లి ఆదిలక్ష్మి వినతిని తిరస్కరించిన ప్రభుత్వం
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): బెదిరింపులు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మోసం, ఫోర్జరీ, ఆస్తుల నష్టం వంటి కేసుల్లో అరెస్టయి కడప సెంట్రల్ జైలులో ఉన్న నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్ ఎత్తేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమె అత్యంత నేరస్వభావం ఉన్న వ్యక్తి అని తెలిపింది. నెల్లూరు జిల్లాకు చెందిన అరుణను విడుదల చేయాలంటూ ఆమె తల్లి ఆదిలక్ష్మి చేసిన వినతిని ప్రభుత్వం తిరస్కరించింది. ఆమె విజ్ఞప్తిలో దయ చూపించాల్సిన అంశాలేవీ లేవని, నిర్బంధ ఉత్తర్వులు కొనసాగుతాయని రాష్ట్ర హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అరుణ నెల్లూరు జిల్లాతో పాటు విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో బెదిరింపులకు పాల్పడి దందాలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గూడూరు ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్‌తో కలిసి తిరుపతి ఆసుపత్రిలోనే సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అనారోగ్యం పేరుతో తరచూ శ్రీకాంత్‌ను బయటికి తీసుకొస్తూ వ్యవస్థలను ‘మేనేజ్’ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ.. నేరాలపై దృష్టి సారించిన పోలీసు శాఖ గత ఏడాది డిసెంబరులో అరెస్టు చేసింది. ఆమె బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటం, నేరాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడం, పై స్థాయిలో ఆమె పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పోలీసులు సిఫారసు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తోందంటూ అరుణపై నెల్లూరు జిల్లా కలెక్టర్ గత ఏడాది డిసెంబరు 8న పీడీ యాక్టు ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆమెను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, తన కుమార్తెపై ఉన్నవన్నీ పాత కేసులేనని, వాటిని సాధారణ క్రిమినల్ చట్టాల కింద విచారణ జరపవచ్చని తల్లి ఆదిలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె అరుణపై పీడీ యాక్టు తొలగించాలని ఆమె కోరారు. ఈ విన్నపాన్ని పరిశీలించిన ప్రభుత్వం నిందితురాలిపై ఉన్న తీవ్ర ఆరోపణల దృష్ట్యా పీడీయాక్ట్ ఎత్తేయడం సాధ్యంకాదని స్పష్టం చేసింది.