ఇక రెండేళ్లకే హక్కులు
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:58 AM
పట్టణ గరిష్ఠ భూ పరిమితి(యూఎల్‌సీ) భూముల విధివిధానాలు, పరిష్కారాలపై సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్...
యూఎల్‌సీ భూములపై ఏపీఎల్‌ఎమ్‌ఏదే తుది నిర్ణయం
రెవెన్యూ శాఖ కీలక నిర్ణయాలు..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పట్టణ గరిష్ఠ భూ పరిమితి(యూఎల్‌సీ) భూముల విధివిధానాలు, పరిష్కారాలపై సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) నేతృత్వం వహించే ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణా సంస్థ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. భూమి హక్కుల బదలాయింపు కాలపరిమితిని గరిష్ఠంగా రెండేళ్లకు తీసుకొచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం మూడు ఉత్తర్వులు (జీవోలు 239,240,241) జారీచేశారు.
ప్రస్తుత విధానం ఇదీ...
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకా రం యూఎల్‌సీ భూముల ద రఖాస్తులను ఏపీఎల్‌ఎమ్‌ఏ ఆమోదం కోసం పంపిస్తారు. లబ్ధిదారులు, థర్డ్ పార్టీ వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ భూముల ప్రాధాన్యం, పొజిషన్‌ను బట్టి క్రమబద్ధీకరణ చేయాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ క్రమబద్ధీకరణకు అనుమతిస్తే నిర్దేశిత ఫీజును వసూలు చేయాలి. ఇలా ఏపీఎల్‌ఎమ్‌ఏలో ప్రతిపాదనలను పరిశీలించి దరఖాస్తులకు ఆమోదం లేదా తిరస్కారం తెలుపుతారు. ఒకసారి దరఖాస్తులను ఆమోదించిన తర్వాత వాటి అమలుకు అంటే.. ఆ భూముల క్రమబద్ధీకరణకు అనుమతించాలని ఏపీఎల్‌ఎమ్‌ఏలో చేసిన తీర్మానాలను ఆమోదించాలని ఫైలును రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపిస్తారు. వాటిని పరిశీలించి, ఆ భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలపాలని రెవెన్యూ శాఖ మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్తుంది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత భూముల క్రమబద్ధీకరణ అమలుపై రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేస్తారు. నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు ప్రతీ దశలో పరిశీలన, ఆమోదం ఉండాలన్నట్లుగా ఈ విధానం తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ విధానం తీసేశారు.
కొత్త విధానం ఇలా...
సీసీఎల్‌ఏ నేతృత్వంలోని ఏపీఎల్‌ఎమ్‌ఏ యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు తీసుకునే నిర్ణయమే ఇక అంతిమం. అనంతరం ఉత్తర్వులు సీసీఎల్‌ఏ స్థాయిలోనే ఇవ్వాలి. ఆ తర్వాత ఫైలును ప్రభుత్వ పరిశీలనకు పంపించాల్సిన అవసరం లేదని జీవో 36లో సవరణ చేశారు. ఏపీఎల్‌ఎమ్‌ఏ నిర్ణయమే ఫైనల్ అంటూ తాజాగా జీవో 239ని రెవెన్యూ శాఖ జారీ చేసింది.
ఇక కాలపరిమితి రెండేళ్లే..
ప్రస్తుత విధానం ప్రకారం.. యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణ అనంతరం హక్కుదారులకు పట్టాలు ఇస్తారు. పట్టాలిచ్చిన పదే ళ్ల తర్వాత వారికి శాశ్వత హక్కులు వస్తాయి. ఆ తర్వాత ఆ భూమిని వారు అమ్ముకోవచ్చు. ఈ నిబంధన 2008 నుంచి అమల్లో ఉంది. ఇప్పుడు ఈ నిబంధనను సడలించారు. పదేళ్ల కాలపరిమితిని రెండేళ్లకు కుదించారు. పట్టాలు ఇచ్చిన రెండేళ్ల తర్వాత హక్కుదారులకు శాశ్వత హక్కులు వస్తాయని జీవో 747లో సవరణ చేసి, తాజాగా జీవో 240ను రెవెన్యూ శాఖ తీసుకొచ్చింది. కాగా యూఎల్‌సీ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోనివారు కూడా ఉన్నారు. ఈ నేపఽథ్యంలో ఈ ఏడాది డిసెంబరు 31 వరకు యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూఎల్‌సీ భూముల క్రమబద్ధ్దీకరణ జరుగుతున్న తీరుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న దశలో ఇప్పుడు ఈ కీలక నిర్ణయాలు, సడలింపులు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.