Share News

రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: అచ్చెన్న

ABN , Publish Date - May 25 , 2026 | 04:59 AM

రైతాంగం స మస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

 రైతు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం: అచ్చెన్న

అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): రైతాంగం స మస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా లభ్యత, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి, ఆక్వా, పౌల్ర్టీ, హార్టీకల్చర్‌, మొక్కజొన్న, కొబ్బరి రైతుల సమస్యలపై ఆదివారం అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల కారణంగా చని పోయిన ఒక్కో కోడికి రూ.100 చొప్పున, గరిష్ఠంగా ఒక్కో పౌల్ర్టీ రైతుకు రూ.10 వేల పరిహారం అందిస్తామన్నారు. 2.04 లక్షల టన్నుల మొక్కజొన్న పంటను ఎమ్మెస్పీకి కొనుగోలు చేయాలని నిర్ణయించి, ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.630 కోట్లు అడ్వాన్స్‌ మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఏడు మండలాల్లో నీటి ఎద్దడికి గురైన బత్తాయి, నిమ్మ తోటలకు డ్రిప్‌ ఇరిగేషన్‌ ఆటోమేషన్‌ పథకాన్ని రాయితీపై అందించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గినా, ఏపీలో 100 కౌంట్‌కు రూ.230, 40 కౌంట్‌కు రూ.330, 30 కౌంట్‌కు రూ.430 ధర ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. చిన్న సైజు రొయ్యలను రైతుల తొందరపడి హార్వెస్ట్‌ చేయవద్దని, ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్మవద్దని సూచించారు. రొయ్యల దాణా ధరల పెరుగుదలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, దీనిపై ఆక్వా అథారిటీ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

Updated Date - May 25 , 2026 | 05:00 AM