ఎల్‌నినోని ఎదుర్కొనేలా పంటల సాగు
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:36 AM
ఎల్‌నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖను ఆదేశించారు.
పంటల మార్పిడి అవకాశాలను పరిశీలించండి
పప్పుదినుసుల సాగుకు ప్రణాళికలు
రైతు చైతన్య కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటా
కష్టకాలంలో రైతుల్ని ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయం
వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖను ఆదేశించారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వారంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, వాణిజ్య, ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సర్టిఫికేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులను చైతన్యపర్చే కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని సీఎం చెప్పారు. రైతులకు శాస్త్రీయ విధానంలో పంటల సాగును తెలియజేయాల్సి ఉందన్నారు. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి ఉత్పత్తులపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘పొగాకు కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేయాలి. గిట్టుబాటు ధర వచ్చేవరకూ నిల్వ చేసుకునే అవకాశాలను పరిశీలించాలి. మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న పప్పుదినుసులను సాగుచేసేందుకు వీలుగా ప్రణాళికలు తయారు చేయాలి. వ్యవసాయ, ఉద్యాన పంటల విషయంలో అదనపు విలువ జోడించాలి‘ అని చెప్పారు. ఆక్వా రైతుల సంఘాలతోపాటు, రొయ్యల దాణా తయారీదారులతోనూ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో ఉన్న రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయిప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.