ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్
ABN , Publish Date - May 30 , 2026 | 04:47 AM
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి, ఆ మేరకు విద్యు త్తు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
గ్రిడ్‌తో 18 గిగావాట్ల అనుసంధానం కోసం
రూ.22 వేల కోట్లతో ప్రతిపాదనలు
ఆ కారిడార్‌తో విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతం
2,261 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు
విద్యుత్ శాఖ సమీక్షలో అధికారుల నివేదన
సూర్యఘర్‌లో ఫస్ట్ రావాలని సీఎం నిర్దేశం
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి, ఆ మేరకు విద్యు త్తు నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3లో భాగంగా సుమారు రూ.22 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన విద్యుత్‌శాఖ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం ఈడ్రైవ్ పథకాల పురోగతి, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 కింద సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే 11 గిగావాట్ల విద్యుత్తును, అలాగే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే సుమారు 7 గిగావాట్ల విద్యుత్తును ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకి వివరించారు. ఈ మేరకు 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయనున్నట్టు వెల్లడించారు. ఈ కారిడార్లో భాగంగా 9,500 మెగావాట్ల సామర్థ్యంతో 5 భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు చెప్పారు. ముదిగుబ్బ, తలుపుల, రామాయపట్నం, పోరుమామిళ్ల, కొప్పాక ప్రాంతాల్లో పూలింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తికి లక్ష్యం నిర్దేశించుకున్నామని, దానికి అనుగుణంగా నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఈ నెట్‌వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక విద్యుత్తు మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు.
సూర్యఘర్ అమలులో వేగం పెరగాలి
పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాల అమలుపై సీఎం అధికారులతో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాల సోలరైజేషన్ ప్రక్రియను మొదలుపెట్టినట్టు అధికారులు సీఎంకి తెలిపారు. దీనిలో రెస్కో మోడల్ అనుసరిస్తున్నామన్నారు. నెట్ మీటరింగ్ విధానంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. అలాగే నెట్‌జీరో విధానంలో హెల్తీ క్యాంప్‌సలను తీర్చిదిద్దేలా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసేందుకు 2,898 హాస్టళ్లు, స్కూళ్లు గుర్తించినట్టు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్కూళ్లలో సోలార్ వినియోగం పెరిగితే.. ప్రభుత్వంపై విద్యుత్తు భారం తగ్గుతుందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 1,35,821 ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చామని, మిగిలిన వాటిని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ వర్గాలకు రూ. 20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బిగించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని, వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఈ వీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ చార్జింగ్ స్టేసన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. స్టాన్‌ఫోర్డు యూనివర్సిటీకి చెందిన ప్రవా హ్ సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ సహకారంతో ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్తు సాంకేతిక నష్టాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న విధానాన్ని అధికారులు ప్రజెంట్ చేశారు. ఈ తరహాలో విద్యుత్తు సరఫరా కోసం దేశంలో మొదటిసారిగా డిజిటల్ ట్విన్ గ్రిడ్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సమీక్షలో భాగంగా విద్యుత్తు డిమాండ్ ఏమేరకు ఉందనే విషయాన్ని అధికారులు సీఎంకి వివరించారు. జూన్ 2026 నుంచి నవంబరు 2026 వరకు రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 12,226 మెగావాట్లకు చేరి, రోజువారీ వినియోగం 226 నుంచి 261 మిలియన్ యూనిట్లు వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 21న రాష్ట్రంలో అత్యధికంగా 15061 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైందని చెప్పారు. 2025తో పోలిస్తే విద్యుత్తు వినియోగం ఈ ఏడాది ఏప్రిల్, మేలో గరిష్ఠ డిమాండ్ 14.48 శాతం నుంచి 16.77 శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. రైతులకు ఆర్థికంగా లబ్ధి కలిగించే కంప్రెస్డ్ బయో గ్యాస్(సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సహించేలా పాలసీ చేశామని, సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
గడువు పెట్టుకుని పనులు చేయాలి
ఆర్టీసీ సమీక్షలో సీఎం చంద్రబాబు
కాలపరిమితిని నిర్దేశించుకుని రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఇన్‌ఫ్రా, ఆర్టీసీపై సీఎం సమీక్షించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాలపై సమీక్షించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్‌పోర్టుల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుంచి విమానాశ్రయాలకు అనుమతులు రాబట్టడంపైనా సూచనలు చేశారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల తేదీలను ఖరారు చేసి ముందస్తుగా ప్రకటించాం. రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలను కూడా 18 నెలల్లో గ్రౌండ్ చేసి ఉత్పత్తి మొదలు పెట్టాలని చెబుతున్నాం. ఇదే తరహాలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులనూ పూర్తి చేయాలి. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలి. కేంద్రం నుంచి అనుమతులు, సాంకేతిక అంశాలు, టెండరు ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. దశాబ్దాలుగా పనుల్లో జాప్యం సహించరాని విషయం. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టాలి. ఆర్టీసీని మరింత బలోపేతం చేసేలా ప్రణాళికలు అమలు చేయాలి’ అని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు బీసీ జనార్దనరెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సీఎస్ సాయిప్రసాద్ పాల్గొన్నారు.
సీఎంతో వరల్డ్ ఎకనమిక్ ఫోరం భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. ఏపీలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవెల్యూషన్(సీ4ఐఆర్) అమలు చేయాల్సిన కార్యాచరణపై ఈ బృందం సీఎంతో చర్చించింది. సీ4ఐఆర్ ఏర్పాటుపై ఏపీ ట్రాన్స్‌కోకి వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో గతంలోనే ఒప్పందం కుదిరింది. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, సైబర్ రెసిలియన్స్ వంటి రంగాలపై సీ4ఐఆర్ అధ్యయనం చేయనుంది. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వివిధ రకాల విద్యుత్తు ఉత్పత్తి మోడళ్లను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి బెస్ట్ మోడల్ తయారు చేయాలని స్పష్టం చేశారు. విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సీ4ఐఆర్ కార్యాచరణతో అనుసంధానం చేయాలని సూచించారు. వచ్చే దావోస్ సదస్సు నాటికి ఏపీ సాధించిన పురోగతిని ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లాలని సీ4ఐఆర్‌కు సీఎం సూచించారు. సమీక్ష సమావేశంలో.. విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ సాయిప్రసాద్, సీఎం స్పెషల్ సీఎస్ విజయానంద్, పలువురు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.