Share News

‘స్థానికం’ ప్రత్యక్షమే!

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:38 AM

గతంలో ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, కార్పొరేషన్‌ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండేది.

‘స్థానికం’ ప్రత్యక్షమే!

  • ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌, మేయర్‌కు నేరుగా ఎన్నికలు

  • సర్పంచ్‌ తరహాలో ప్రజలచే నేరుగా ఎన్నిక.. కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం!

  • ప్రజాప్రతినిధులతో ఇప్పటికే సీఎం చర్చలు

  • ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఉత్సవ విగ్రహాలుగా

  • మారిన మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు

  • అధికారాల్లేని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు

  • స్థానిక సంస్థల బలోపేతానికి సంస్కరణలు తేవాలని సర్కారు సంకల్పం

  • అందుకే ప్రత్యక్ష సమరానికి సిద్ధం!

‘స్థానికమూ’... ఇక సమరమే! హోరాహోరీ పోరుతో రసవత్తరమే! ఇప్పటిదాకా పరోక్ష పద్ధతిలో జరుగుతున్న మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌, మేయర్‌ ఎన్నికలను ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, ‘అవిశ్వాసం’ బెడదను తప్పించడమే లక్ష్యంగా ఈ కీలక సంస్కరణకు సిద్ధమైంది. ఇది అమలులోకి వస్తే... సర్పంచ్‌, ఎమ్మెల్యే, ఎంపీ తరహాలోనే మండలాధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలే ఎన్నుకుంటారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులతో పలు దఫాలు చర్చించినట్లు తెలుస్తోంది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

గతంలో ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, కార్పొరేషన్‌ మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండేది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణల ద్వారా మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత... ఎంపీటీసీలు ఎంపీపీలను, జడ్పీటీసీలు జడ్పీ చైర్‌పర్సన్లను, కౌన్సిలర్లు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను, కార్పొరేటర్లు మేయర్లను ఎన్నుకునే పద్ధతి వచ్చింది. అయితే... ఈ విధానంతో స్థానిక సంస్థల్లో పాలన కుంటుపడుతోందనే అభిప్రాయముంది. గెలుపొందిన ఎంపీటీసీల్లో ఒకరిని ఎంపీపీగా ఎన్నుకోవడం ఒక్కటే ఎంపీటీసీల పనిగా మారింది. మరే అధికారాలూ వారికి లేవు. జడ్పీటీసీల పరిస్థితీ ఇంతే. ఈ నేపథ్యంలో ఎలాంటి అధికారం లేని ఎంపీటీసీ, జడ్పీటీసీలను రద్దు చేయాలని గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రక్రియ జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. దీనికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. దీంతో ఈ ఆలోచనకు స్వస్తి పలికారు. ప్రభుత్వాలు స్థానిక సంస్థలను పట్టించుకోకపోవడంతో ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్లు ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి పాలనా సంస్కరణలు తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు ప్రత్యక్షంగా స్థానిక ‘సారథుల’ను ఎన్నుకునేలా చట్ట సవరణలు చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహించినప్పటికీ ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌లను నేరుగా ఎన్నుకోవడం ద్వారా మండల, జడ్పీల పాలన సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నారు.


అవిశ్వాసం బెడదకు స్వస్తి...

గ్రామాల్లో వార్డుల సభ్యులతో పాటు సమాంతరంగా సర్పంచ్‌లను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నికైన సర్పంచ్‌ను ఐదేళ్లపాటు అభిశంసనతో తొలగించే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తమలో ఒకరిని ఎంపీపీగా, జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుంటున్నారు. ప్రతి రెండన్నరేళ్లకోసారి అభిశంసన ప్రక్రియ తెరపైకి వస్తోంది. దీంతో మండలాలు, జిల్లా పరిషత్‌ల పాలనలో అనిశ్చితి ఏర్పడుతోంది. ప్రత్యక్ష ఎన్నికలు జరిపితే ఎన్నికైన స్థానికసంస్థ ప్రజాప్రతినిధి ఐదేళ్లూ పదవిలో ఉండే అవకాశముంటుంది. పరిపాలన సుస్థిరంగా కొనసాగుతుంది.

  • రాష్ట్రప్రభుత్వాలు మారినప్పుడల్లా దాని ప్రభావం స్థానిక సంస్థలపై పడుతోంది. వేరే పార్టీ అధికారంలోకి రాగానే మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో అభిశంసన ప్రక్రియ జోరందుకుంటోంది. అందుకే ఎన్నిక విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.


బల్వంత్‌రాయ్‌ కమిటీ సిఫారసులతో..

1959లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రారంభమైంది. 1986లో మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన తర్వాత మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడ్డాయి. 1992లో 3వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందింది. 1994లో ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లతో కూడిన మూడంచెల వ్యవస్థ ఏర్పడింది. ప్రజలకు ప్రత్యక్ష ప్రాతినిధ్యం కల్పించేందుకు జిల్లాను ప్రాదేశిక నియోజకవర్గాలు గా విభజించి.. నేరుగా జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునే విధానం ప్రారంభమైంది. కొత్త చట్టం ప్రకారం 1995లో మొదటిసారి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు.

Updated Date - Aug 06 , 2026 | 04:40 AM