అసలెవరో?.. నకిలీలెవరో తేల్చేస్తారు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 05:35 AM
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 1,200 మంది పశుసంవర్ధక సహాయకులు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
గ్రామ పశుసంవర్ధక సహాయకుల సర్టిఫికెట్ల తనిఖీకి ఆదేశాలు
ఉద్యోగులకు వ్యక్తిగతంగానూ మెమోలు
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న 1,200 మంది పశుసంవర్ధక సహాయకులు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందారన్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పశుసంవర్ధక సహాయకుల పత్రాలను తనిఖీచేసి, ఈ నెల 25లోపు వివరణాత్మక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు పూర్వపు జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులకు తాజాగా మెమో జారీ చేశారు. గత ప్రభుత్వంలో గ్రామ సచివాలయాల్లో పెద్ద సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలతో పశుసంవర్ధక సహాయకులుగా ఉద్యోగాలు పొందారనే అంశంపై 2025 నవంబరు 23న ‘ఆంధ్రజ్యోతి’లో ‘సచివాలయాల్లో శంకర్‌దాదాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన జయరాములు అనే వ్యక్తి లోకాయుక్తలో ఇటీవల ఫిర్యాదు చేశారు. అలాగే పలువురు ప్రజావేదికలో ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నకిలీ ధ్రువపత్రాలతో పశుసంవర్ధక సహాయకులుగా ఉద్యోగాలు పొందటంపై నాటి దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, ఈ పోస్టులు పొందటానికి వెయిటేజ్ మార్కులు పొంది న వారి ధ్రువపత్రాలను కూడా తనిఖీ చేయాలని, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు లేదా ఇతర విద్యా సంస్థల నుంచి సర్టిఫికెట్లు పొందిన ఈ ఉద్యోగులకు వ్యక్తిగతంగా మెమోలు జారీ చేయాలని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సదరు ఉద్యోగుల సర్టిఫికెట్లను సంబంధిత ఇంటర్ బోర్డు, ఆయా సంస్థలకు పంపి, ప్రామాణికతను నిర్ధారించాలన్నారు. ప్రభు త్వం నుంచి జీతాలు పొందుతూ, రెగ్యులర్ కోర్సు సర్టిఫికెట్ పొందిన వారి పత్రాలను కూడా తనిఖీ చేయాలన్నారు. సదరు పశుసంవర్ధక సహాయకులు వివరణలు సమర్పించని పక్షంలో నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని పూర్వపు జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.