Share News

టీచర్‌ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి!

ABN , Publish Date - May 14 , 2026 | 05:01 AM

ఉపాధ్యాయుల పదోన్నతులకు ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)’ను తప్పనిసరి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

టీచర్‌ పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి!

  • సీనియారిటీ జాబితాలో టెట్‌ వివరాలు నమోదుచేయాలి

  • పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల పదోన్నతులకు ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)’ను తప్పనిసరి చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితాల్లో వారి టెట్‌ వివరాలు నమోదుచేయాలని డీఈవోలను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. టెట్‌ మార్కులు, ఏపీటెట్‌ లేదా సీటెట్‌లో అర్హత సాధించారా? లేదా? ఏపీటెట్‌లో ఏ పేపర్‌లో అర్హత సాధించారు? పేపర్‌-2లో అర్హత సాధించి ఉంటే సబ్జెక్టు, మాధ్యమం వివరాలను సీనియారిటీ జాబితాలో చేర్చాలని ఆదేశించింది. గతేడాది ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసే అవకాశం కల్పించిన విషయాన్ని, అలాగే టీచర్ల పదోన్నతుల అంశంలో ఎన్‌సీటీఈ నిబంధనలను ప్రస్తావించింది. పదోన్నతులకు టెట్‌ను తప్పనిసరి చేయాలని టీచర్ల నుంచి వినతులు అందాయని, డీఈవోల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపింది. టీచర్లకు టెట్‌ అర్హత తప్పనిసరి అని గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Updated Date - May 14 , 2026 | 05:01 AM