కామన్ పోర్టల్ ద్వారా పోస్టుల భర్తీ
ABN , Publish Date - May 15 , 2026 | 04:32 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియను కామన్ పోర్టల్ ద్వారా చేపట్టనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులంతా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియను కామన్ పోర్టల్ ద్వారా చేపట్టనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులంతా పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 1,523 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందుకోసం గతంలో జారీచేసిన జీవో 20కు పలు సవరణలు చేసింది. అభ్యర్థులు తొలుత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని వర్సిటీలకు పంపాల్సి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి దరఖాస్తుకు నిర్దేశిత రుసుమును వేర్వేరుగా చెల్లించాలి. అభ్యర్థులు ఒకే వర్సిటీలో వేర్వేరు పోస్టులకు, వేర్వేరు వర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రతిదానిని ప్రత్యేక దరఖాస్తుగా పరిగణిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. డిపార్ట్‌మెంటల్ కమిటీ అర్హతను పరిశీలిస్తుంది. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబితాలు ప్రకటిస్తుంది. ఒక పోస్టుకు 12 దరఖాస్తులు దాటితేనే ఈ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థుల దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హత ఉంటేనే పరీక్షకు అనుమతిస్తుంది. ఏపీపీఎస్సీతో ఉన్నత విద్యాశాఖ సమన్వయం చేసుకుంటుంది. ఇందుకోసం కమిషన్‌తో ఎంవోయూ చేసుకుంటుంది. ఇంటర్వ్యూలకు 1ః4 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలి.
కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి వెయిటేజీ ఇవ్వనున్నారు. ఏడాదికి 0.5 శాతం చొప్పున గరిష్ఠంగా పదేళ్లకు వెయిటేజీ మార్కులు ఇస్తారు. కాంట్రాక్టు సిబ్బంది భర్తీ జరిగి పదేళ్లు దాటిపోయిందనందున ఏపీపీఎస్సీ 450 మార్కులకు నిర్వహిచే రాత పరీక్షలో అందరికీ 5 శాతం వెయిటేజీ లభిస్తుంది. అలాగే ఇంటర్వ్యూల్లో ఏటా ఒక మార్కు చొప్పున గరిష్ఠంగా 10 మార్కుల వెయిటేజీ ఇస్తారు. వంద మార్కులకు ఇంటర్వ్యూ జరుగుతుంది. వెయిటేజీపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.