Share News

గ్రామ కంఠంలోని ఇళ్లకు రిజిస్ర్టేషన్‌

ABN , Publish Date - May 19 , 2026 | 05:10 AM

గ్రామ కంఠాల్లోని నివాసాలు, వారసత్వంగా వచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామ కంఠంలోని ఇళ్లకు రిజిస్ర్టేషన్‌

  • వారసత్వంగా వచ్చిన స్థలాలకూ చేయాల్సిందే

  • గ్రామకంఠం సర్వే నంబరు నుంచి సబ్‌ డివిజన్‌ చేసి వాటికి రిజిస్ర్టేషన్‌

  • రికార్డులు,పత్రాల కోసం ఒత్తిడి వద్దు

  • ఆ కారణంగా రిజిస్ట్రేషన్లను ఆపొద్దు

  • సరైన పత్రాలు లేనివారి నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకోండి

  • నిషేధ జాబితాలో ఉన్నవాటికీ విముక్తి

  • రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రామ కంఠాల్లోని నివాసాలు, వారసత్వంగా వచ్చిన స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ కంఠంలోని భూములు నిషేధ జాబితాలో ఉన్నా, అందులో ప్రజలకు ఇళ్లు, నివాస స్థలాలు ఉన్నట్టయితే నిర్దిష్ట డాక్యుమెంట్ల ఆధారంగా వాటికి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. మొత్తం గ్రామకంఠం సర్వే నంబర్‌ నుంచి ప్రజల ఇళ్లు, నివాస స్థలాలున్న భూమిని సబ్‌డివిజన్‌ చేసి, వాటిని రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలు కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయుప్రసాద్‌ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. గ్రామకంఠాల్లోని ఇళ్లు, నివాస స్థలాలను నిషేధ జాబితా నుంచి తొలగించి, వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలంటూ 2015లో ప్రభుత్వం జీవో 187, 361 జారీ చేసింది. వీటి ప్రకారం గ్రామకంఠంలోని ఇళ్లు, స్థలాలను సబ్‌ డివిజన్‌చేసి వాటికి సర్వే నంబర్లను వేరే కేటాయించి నిషేధ విముక్తి కల్పించాలి. కానీ అది జరగడం లేదు. దీంతో గ్రామకంఠంలోని ఇళ్లు, నివాస స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ నేపఽథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ నూతన మార్గదర్శకాలు ఇచ్చారు.


కీలకాంశాలివీ..

  • వెబ్‌ల్యాండ్‌ రికార్డు ప్రకారం ఓ ఆస్తి గ్రామకంఠం సర్వే నంబర్‌లో ఉంటే ఏం చేయాలి?

ఆ సర్వే నంబర్‌తో సంబంధం లేకుండా, అది నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయాలి.

  • గ్రామకంఠం సర్వే నంబర్‌లో ఉన్న ఆస్తికి లింకు డాక్యుమెంట్‌ ఉంటే ఏం చేయాలి?

ఆ ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం లింకు డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్‌ అధికారి అనుమతించాలి.

  • గ్రామకంఠంలోని నివాసిత ప్రాంతంలో ఉన్న ఆస్తికి ఎలాంటి లింకు డాక్యుమెంట్‌ లేదు. కానీ ఇల్లు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడేం చేయాలి?

గ్రామ కంఠంలోని ఇంటికి ఆస్తిపన్ను రశీదు ఉంటే, దాన్ని రిజిస్ట్రేషన్‌ అధికారి ప్రామాణికంగా తీసుకోవాలి.

  • పట్టణ గ్రామకంఠాల పరిధిలో వారసత్వంగా వచ్చిన ఇంటి స్థలాలు ఉండి, అవి సుదీర్ఘకాలం ఖాళీగా ఉండి, వాటికి లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదులు లేకుంటే ఏం చేయాలి?

పట్టణ గ్రామకంఠంలో వారసత్వంగా వచ్చిన ఇంటిస్థల ం ఉంటే, దానికి సంబంధించిన ఖాళీ స్ధలం పన్ను (వెకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌-వీఎల్‌టీ) రశీదు, ఇంకా ఇతర డాక్యుమెంట్లను (2023, మార్చి31న ఇచ్చిన సర్క్యులర్‌లోని అంశాలను) రిజిస్ట్రేషన్‌ అధికారి పరిగణనలోకి తీసుకోవాలి.

  • గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం సర్వే నంబర్‌లో వారసత్వంగా వచ్చిన ఇంటిస్థలం ఉండి, అది సుదీర్ఘకాలం ఖాళీగా ఉంటూ, వాటికి ఎలాంటి లింకు డాక్యుమెంట్లు, ఇంటిపన్ను రశీదు, ఇతర డాక్యుమెంట్లు లేకుంటే ఏం చేయాలి?

రిజిస్ట్రేషన్‌ అధికారి ఈ విషయంలో గత ఫిబ్రవరి 17న ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. రెవెన్యూ రికార్డులు, ఇతర పత్రాలు కావాలని ఒత్తిడి చేస్తూ, ఆ కారణంగా రిజిస్ట్రేషన్‌ ఆపొద్దు. ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేనప్పుడు, సంబంధిత వ్యక్తి నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆ భూమి లేదా ఆస్తి తనకు వారసత్వంగా వచ్చిందని, అది తన పొజిషన్‌లోనే ఉందని, అది నిషేధ జాబితాలో లేదని ఆ పత్రంలో ఆ వ్యక్తి పేర్కొనాలి.

Updated Date - May 19 , 2026 | 05:13 AM