ఏడాదిపాటు సానబట్టాల్సిందే!
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:02 AM
ప్రత్యక్ష నియామక విధానంలో సర్వీసులోకి వచ్చే డిప్యూటీ తహశీల్దార్ల (డీటీ) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న కాలానుగుణంగా..
డైరెక్ట్ రిక్రూటీ డిప్యూటీ తహశీల్దార్లకు 362 రోజులు శిక్షణ
రెవెన్యూ శాఖ తాజా ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష నియామక విధానంలో సర్వీసులోకి వచ్చే డిప్యూటీ తహశీల్దార్ల (డీటీ) విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న కాలానుగుణంగా.. ప్రభుత్వ, ప్రజల సేవలను దృష్టిలో పెట్టుకుని వారికి కనీసం ఏడాదిపాటు వివిధ అంశాలపై సమగ్ర శిక్షణ ఇవ్వాలని నిశ్చయించింది. భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వంలో కీలకమైన 23 శాఖల్లో పనిచేయించడంతోపాటు, ఆయా అంశాలపై వారికి సమగ్ర అవగాహన కల్పించాలని, ఇదంతా శిక్షణలో భాగంగానే చూడాలని స్పష్టం చేసింది. వారికి 362 రోజుల పాటు రెవె న్యూతోపాటు మరో 23 శాఖల అంశాలపై శిక్షణ ఇప్పించేలా మార్గదర్శకాలు జారీ చేస్తూ రెవెన్యూశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు (జీవో 230) జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా నియమితులయ్యే డిప్యూటీ తహశీల్దార్లు.. ప్రొబేషనరీ కాలం ముగిసిన తర్వాత రెవెన్యూ శాఖ, ఇతర విభాగాల్లో రెగ్యులర్ డీటీలుగా పనిచేస్తున్నారు. నాలుగైదేళ్ల తర్వాత వారికి తహశీల్దార్‌గా పదోన్నతులు వ స్తాయి. ఆ తర్వాత మరో ఏడెనిమిదేళ్లకు వారికి డిప్యూటీ కలెక్టర్‌గా ప్రమోషన్ వస్తుంది. సర్వీసు బాగా ఉన్నవారికి.. ఆ తర్వాత రెవెన్యూ కోటా కింద స్టేట్ సర్వీసులో ఐఏఎస్ పదోన్నతులు కూడా దక్కుతాయి. రెవెన్యూలో డిప్యూటీ తహశీల్దారు పోస్టు ఎంత కీలకమైనదో ఈ పదోన్నతుల పరిణామక్రమమే చెబుతోంది.
41 ఏళ్లకు సవరణ..
డైరెక్ట్ రిక్రూటీ డీటీలకు ఏయే అంశాల్లో శిక్షణ ఇవ్వాలో 1985లో జీవో 1314 ద్వారా స్పష్టత ఇచ్చారు. రెవెన్యూ, సర్వే సంబంధిత విభాగాలకే శిక్షణ ఉండేది. త ర్వాత 41 ఏళ్లకు అంటే గత నెలలో ఆ ఉత్తర్వులను సవరించారు. రెవెన్యూతోపాటు, సర్వే, గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, కలెక్టరేట్, పోలీసు శాఖ, గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్, వ్యవసాయం, పంచాయతీరాజ్, మానవ వనరుల విభాగాల్లో కూడా నాలుగైదు నెలలపాటు వారు శిక్షణ పొందాలని పేర్కొంటూ మార్చి 18న ప్రభుత్వం జీవో 178ని తీసుకొచ్చింది. అయితే మారిన పరిస్థితులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి శిక్షణ కాలం కనీసం 362 రోజులు ఉండాలని రెవెన్యూ శాఖ భావించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జయలక్ష్మి ఈ నెల 2వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అన్ని కీలక శాఖల్లో డీటీలు పనిచేసి శిక్షణ పొందేలా జీవో 178లో సవరణలు తీసుకురావాలని, తాజా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సోమవారం జీవో 230 జారీ చేశారు. 51 వారాల 5 రోజులు అంటే.. 362 రోజుల పాటు వారికి శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో వారం.. సర్వే, సెటిల్‌మెంట్ విభాగం, వీఆర్‌ఏ, వీఆర్‌వోల వ్యవస్థ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ విభాగంలో నాలుగేసి వారాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇక మండల స్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థ, రెవెన్యూ విభాగంలో గరిష్ఠంగా 8వారాలపాటు పనిచేయాలి. డివిజనల్ స్థాయిలో ఆర్‌డీవో కార్యాలయంలో.. కలెక్టరేట్‌లోని డీఆర్‌వో, ఇతర రెవెన్యూ విభాగాల్లో ఇంకో నాలుగేసి వారాలు శిక్షణలో భాగంగా పనిచేయాలి. పోలీసు శాఖలో ఇన్‌స్పెక్టర్ ద్వారా ఇచ్చే శిక్షణ వారం రోజులు ఉండేలా నిర్దేశించారు. జలవనరుల విభాగం. వ్యవసాయ శాఖలో సగటున రెండు వారాల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. సహకార శాఖలో వారం రోజుల శిక్షణ తప్పనిసరి చేశారు.