Share News

ఖనిజాల గని ఏపీ

ABN , Publish Date - Jul 01 , 2026 | 04:41 AM

రాష్ట్రంలో ఖనిజాల లభ్యత ప్రాంతాలను గుర్తించే మినరల్‌ పొటెన్షియల్‌ ఏరియా(ఎంపీఏ) మ్యాపింగ్‌ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో..

ఖనిజాల గని ఏపీ

  • 62 వేల చ.కి.మీ. పరిధిలో మినరల్‌ మ్యాపింగ్‌

  • 125 రకాల ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలున్నాయి

  • సీఎం చంద్రబాబుకు గనుల శాఖ నివేదిక

  • ఖనిజాల మార్కెట్‌పై అధ్యయనం చేయాలి: సీఎం

అమరావతి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖనిజాల లభ్యత ప్రాంతాలను గుర్తించే మినరల్‌ పొటెన్షియల్‌ ఏరియా(ఎంపీఏ) మ్యాపింగ్‌ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో మినరల్‌ మ్యాపింగ్‌ చేసినట్లు సీఎం చంద్రబాబుకు గనుల శాఖ నివేదించింది. ఇందులో విలువైన 125 ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో గనులశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మినరల్‌ మ్యాపింగ్‌పై సీఎంకు ఆ శాఖ నివేదిక సమర్పించింది. దీనిప్రకారం క్రిటికల్‌, స్ట్రాటజిక్‌ మినరల్స్‌కు సంబంధించి 48, అధికవిలువ కలిగిన బల్క్‌ మినరల్స్‌కు సంబంధించి 47, మరో 30 అతివిలువైన ఖనిఖాలు లభ్యమయ్యే మినరల్‌ పొటెన్షియల్‌ ఏరియాలు ఉన్నాయి. డైమండ్‌, లైమ్‌స్టోన్‌, బెరైటీస్‌, ఐరన్‌ఓర్‌, బాక్సైట్‌, బంగారం, మాంగనీస్‌, గ్రాఫైట్‌, లిథియం తదితర ఖనిజాల లభ్యప్రాంతాలున్నాయని నివేదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ఖనిజాల మార్కెట్‌పై నిపుణులతో అధ్యయనం చేయాలని ఆదేశించారు. జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద బంగారంనిల్వలు ఉన్నాయని, మిగతా బ్లాక్‌లు కూడా గుర్తించి అధ్యయనం చేయాలన్నారు. ఏపీ టైటానియం స్ట్రాటజిక్‌ మెటీరియల్‌ మిషన్‌(ఏపీ-టీఎస్ఎమ్‌ఎమ్‌)పై గనుల శాఖ ప్రజెంటేషన్‌ ఇచ్చినా, దానిపై పూర్తి చర్చజరగలేదు. జొన్నగిరి మైనింగ్‌లో ఈ ఏడాది 400 కేజీల మేర పసిడి రావొచ్చని అధికారులు చెప్పారు. పేదలకు లబ్ధి చేకూర్చే ఉచిత ఇసుక పంపిణీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Jul 01 , 2026 | 04:42 AM