Share News

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి..

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:05 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి రాష్ట్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఎంప్యానల్‌మెంట్‌ ముసాయిదాను ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్తంగా రూపొందించాయి.

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి..

నెలకు లక్షన్నర వరకూ సంపాదించుకునే అవకాశం

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ పాలసీకి రాష్ట్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ ఎంప్యానల్‌మెంట్‌ ముసాయిదాను ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్తంగా రూపొందించాయి. ఈ ముసాయిదా పాలసీకి మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌ (ట్విట్టర్‌) వంటి సోషల్‌ మీడియా వేదికల్లో యాక్టివ్‌గా ఉండే క్రియేటర్లను అధికారికంగా ఎంప్యానెల్‌ చేసుకోనున్నారు. దీంతో ఒక్కో కంటెంట్‌ క్రియేటర్‌కు నెలకు లక్షన్నర వరకూ సంపాదించే అవకాశం దక్కనుంది. ఈ ముసాయిదా ప్రకారం సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉన్న గరిష్ఠ ఫాలోవర్ల సంఖ్య ప్రాతిపదికన కంటెంట్‌ క్రియేటర్లను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.

ముఖ్య నిబంధనలు, అర్హతలు..

కనీస ఫాలోవర్లు: ఏదైనా ఒక ప్రధాన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో కనీసం 10 వేల మంది ఫాలోవర్లు ఉండాలి. వయస్సు 18 ఏళ్లు నిండాలి.

వ్యక్తిగత ఖాతాలకే: వ్యక్తిగత, సమాచార ఖాతాలకే అవకాశం. కంపెనీలు, సంస్థల పేరి ఖాతాలకు లేదు.

కంటెంట్‌ పరిశీలన: దరఖాస్తు దారుడి గత 60 పోస్టులను నిశితంగా పరిశీలిస్తారు. అసభ్యత, ద్వేషపూరిత ప్రసంగాలు, దేశ వ్యతిరేక లేదా మత విద్వేష కంటెంట్‌, తప్పుడు సమాచారం ఉండకూడదు. ఎంప్యానెల్‌ అయ్యాక నిబంధనలు ఉల్లంఘిస్తే బ్లాక్‌ లిస్టులో పెడతారు.

దరఖాస్తు.. ఎంపిక ప్రక్రియ..

రిజిస్ట్రేషన్‌: ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురానున్న పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలి.

పరిశీలన: రెండు దశల ధ్రువీకరణ అనంతరం స్ర్కూటినీ కమిటీ తుది ఆమోదం తెలుపుతుంది.

కార్డు జారీ: ఎంపికైన క్రియేటర్లకు అధికారిక కార్డులు.

ఒప్పంద కాలం: ప్రాథమికంగా ఏడాది పాటు ఒప్పందం ఉంటుంది. పనితీరు ఆధారంగా మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.

Updated Date - Sep 24 , 2026 | 04:05 AM