Share News

ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:16 AM

రాష్ట్రంలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిధి పేరోల్‌ వ్యవస్థలో ఇంకా...

ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

  • జూన్‌ వరకు సీఎఫ్ఎంఎస్‌ ద్వారానే జీతాలు

  • 3,143 మంది ఉద్యోగులకు ఊరట.. జూలై నుంచి నిధి పే రోల్‌

గుంటూరు సిటీ, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిధి పేరోల్‌ వ్యవస్థలో ఇంకా నమోదు కాని ఉద్యోగులకు 2026 జూన్‌ వరకు సీఎఫ్ఎంఎస్‌ (కంప్రహెన్సివ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్మెంట్‌ సిస్టం) ద్వారా జీతాలు చెల్లించేందుకు ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌ డైరెక్టరేట్‌ అనుమతి ఇచ్చింది. ఈమేరకు ట్రెజరీస్‌ డైరెక్టర్‌ పద్మజా కారే సర్క్యులర్‌ మెమో జారీ చేశారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో మొత్తం 5,689 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 2,546 మందిని ఇప్పటికే నిధి పే రోల్‌లో చేర్చారు. అయితే శాంక్షన్‌ పోస్టులకు సంబంధించిన పత్రాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో మిగిలిన 3,143 మంది ఉద్యోగులను నిధి పోర్టల్‌లో నమోదు చేయడం సాధ్యపడలేదు. దీంతో వారి జీతాల చెల్లింపుపై నెలకొన్న అనిశ్చితిని తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ట్రెజరీస్‌ శాఖ ఉత్తర్వుల ప్రకారం, నిధి పేరోల్‌లో చేరని ఉద్యోగుల జీతాలను జూన్‌-2026 వరకు పాత విధానంలో సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లించవచ్చు. ఇదే సమయంలో, మిగిలిన ఉద్యోగులందరినీ త్వరితగతిన నిధి పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రజారోగ్య శాఖను ఆదేశించారు. అయితే, ఈ మినహాయింపు జూన్‌-2026 వరకు మాత్రమే వర్తిస్తుందని, జూలై-2026 నుంచి అన్ని కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు నిధి పేరోల్‌ ద్వారానే చెల్లించాలని ట్రెజరీస్‌ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే నిధి పేరోల్‌లో చేరిన ఉద్యోగుల జీత బిల్లులను సీఎఫ్ఎంఎస్‌ ద్వారా సమర్పించకుండా జిల్లా ట్రెజరీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో నిధి పేరోల్‌లో ఇంకా నమోదు కాని వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు తాత్కాలికంగా ఊరట లభించింది.

Updated Date - Jul 02 , 2026 | 03:17 AM