మరో ఏడాది ఐదు రోజుల పనిదినాలు!
ABN , Publish Date - Jun 16 , 2026 | 03:50 AM
అమరావతి రాజధాని పరిధిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.
ఉద్యోగుల విన్నపం మేరకు కొనసాగింపు
సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పరిధిలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సచివాలయం, హెచ్‌వోడీల్లో విధులు నిర్వర్తించే ప్రభుత్వం ఉద్యోగుల సౌకర్యార్థం 2016 మే నెల నుంచి పని దినాలను ప్రభుత్వం ఐదు రోజులకు కుదించింది. గత తొమ్మిదేళ్ల నుంచి ఏటా ఈ సౌలభ్యాన్ని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా ఈ నెల 27వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీలు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల విన్నపం మేరకు 2027 జూన్ వరకూ ఐదు రోజుల పనిదినాలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ విధులు నిర్వర్తించాలన్న నిబంధనను పాటించాలని ప్రభుత్వం సూచించింది.