కొరత లేకుండా మంచినీటి సరఫరా
ABN , Publish Date - May 05 , 2026 | 05:23 AM
ఈ వేసవికాలంలో రాష్ట్రంలో మంచినీటి కొరత రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంచి నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు..
జిల్లాకు ప్రత్యేకంగా రూ. కోటి కేటాయిస్తున్నాం.. 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలి
అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా డీలర్లు
ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగం పెంచాలి
కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఈ వేసవికాలంలో రాష్ట్రంలో మంచినీటి కొరత రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంచి నీటి సరఫరా కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా రూ. కోటి చొప్పున విడుదల చేయాలని సీఎస్ జి.సాయిప్రసాద్‌ను ఆదేశించారు. సచివాలయంలోని రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. మంచి నీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని, జిల్లాల్లో బోర్లు కూడా మరమ్మతులు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లను మరింత సరళీకృతం చేయాలని రవాణాశాఖకు సీఎం సూచించారు. వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తించేందుకు అనుమతిని ఇచ్చారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం అందించే పౌర సేవల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెంచేందుకు వీలుగా నిపుణులతో కూడిన సలహామండలిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో డ్రోన్ల వినియోగం పెంచేలా ఓ వర్క్‌షాప్ నిర్వహించాలన్నారు. అవేర్ సాంకేతికతను వినియోగించుకుని వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడగాడ్పులకు గురికాకుండా ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సేవలను తీసుకోవాలని చెప్పారు. అత్యవసర సేవలు మినహా అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల సేవలు సులువుగా అందించేందుకు, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ఉండేందుకు ఈ ఆన్‌లైన్ సేవలు పెంచాలని నిర్దేశించారు. పంటలకు ధర కల్పించే విషయంలోనూ రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు కూడా అవసరమని, కార్యదర్శుల స్థాయి అధికారులు నెలలో మూడు రోజులు, హెచ్‌ఓడీలు ఆరు రోజులు, కలెక్టర్లు ఎనిమిది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేలా అత్యుత్తమ విధానాలు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపితే అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
పారిశ్రామిక క్లస్టర్లకు లాజిస్టిక్స్ కనెక్టివిటీ
రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల పరిధిలో అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక క్లస్టర్ల గురించి చర్చించారు. రాష్ట్రంలోని ఎంఎ్‌సఎంఈల్లోని ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను స్థానిక, ప్రాంతీయ, దేశవిదేశీ మార్కెట్లకు చేర్చేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్వే, పోర్టు కనెక్టివిటీ ఉండేలా లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ చేయాలని చెప్పారు.
పారిశ్రామిక క్లస్టర్ వద్ద టౌన్‌షిప్‌లు
ప్రతి పారిశ్రామిక క్లస్టర్ వద్ద ఇండస్ట్రియల్ టౌన్‌షి్‌పల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ‘వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ ప్రెన్యూర్’ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలని నిర్దేశించారు. పారిశ్రామిక క్లస్టర్లలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించాలని చెప్పారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవల్‌పమెంట్ జరగాలన్నారు. యూనివర్సిటీల్లోనూ నైపుణ్య కోర్సులను హైబ్రిడ్ విధానంలో అందించే ఆలోచన చేయాలని సూచించారు.