Share News

ఆక్వా దాణా ధర రూ.4 తగ్గింపునకు ఓకే

ABN , Publish Date - Jun 19 , 2026 | 05:22 AM

రొయ్యల దాణా ధరల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. అటు రైతులకు, ఇటు దాణా తయారీదారులకు మధ్యే మార్గంగా ప్రస్తుత ధరపై కిలోకు రూ.4 తగ్గించేలా సీఎం ఒప్పించారు.

ఆక్వా దాణా ధర రూ.4 తగ్గింపునకు ఓకే

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా ధరల సమస్యకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారు. అటు రైతులకు, ఇటు దాణా తయారీదారులకు మధ్యే మార్గంగా ప్రస్తుత ధరపై కిలోకు రూ.4 తగ్గించేలా సీఎం ఒప్పించారు. సీఎం చొరవతో దాణా కిలో రూ.112 నుంచి రూ.108కి తగ్గనున్నది. దీనిపై చేపలు, రొయ్యల సాగు రైతులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. దాణా ధరల స్థిరీకరణకు ఆక్వా రైతులు, తయారీదారులు, నిపుణులతో కమిటీ వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కమిటీ 20రోజుల్లో నివేదిక సమర్పించాలని, ఆతర్వాత ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో దాణా ధరలు ఆరుసార్లు పెంచారని, అయినా నాటి ప్రభుత్వం ధర తగ్గింపుపై ఎలాంటి చొరవ తీసుకోలేదని ఆక్వా రైతులు సీఎం దృష్టికి తెచ్చారు. 2019లో కిలో రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.107.80కి చేరిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధర రూ.5.80 తగ్గిందని చెప్పారు. తామెప్పుడూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఇటీవల కొందరు ఆక్వా రైతుల ముసుగులో రాజకీయం చేశారని తెలిపారు. యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇస్తున్నందున సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ముడి సరుకు ధర పెరిగినప్పుడు దాణా ధరలు పెంచుతున్నారని, కానీ ధర తగ్గినప్పుడు ధర తగ్గించడం లేదన్నారు. రాయితీలకు సంబంధించి నిర్ధేశించిన ఎంప్యానెల్‌ విషయంలో మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దాణా తయారీదారుల ప్రతినిధులు తమ వాదనని కూడా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా, ఈ రెండేళ్లలో రూ.1,543కోట్ల మేర విద్యుత్‌ రాయితీ రూపంలో ఆక్వాకు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఇదిలావుంటే ఆక్వా గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


రైతుల కోసం..

‘మాది రైతు ప్రభుత్వం. రైతులకు అన్యాయం జరిగితే కూటమి ప్రభుత్వం ఊరుకోదు’ అని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు.. తన మాటలను చేతల్లో చూపించారు. గురువారం ఆక్వా, పొగాకు రైతులు, వ్యాపారులు, అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, దాణా తయారీదారులు నష్టపోకుండా ప్రస్తుత ధరపై కిలోకు రూ.4 తగ్గించేలా ఇరువర్గాలనూ ఒప్పించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కమిటీ వేశారు. ఆ తర్వాత తోతాపురి మామిడి ధరపై చర్చించిన సీఎం, కిలోకు రూ.4 ప్రోత్సాహం ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత వర్జీనియా పొగాకు రైతులు, ట్రేడర్లతో సమావేశమై పొగాకు కొనుగోళ్లు, ధరలపై సమీక్షించారు. పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కు తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. పొగాకు వేలం కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, కంపెనీలన్నీ వేలంలో పాల్గొని, తప్పనిసరిగా కొనుగోళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు.

Updated Date - Jun 19 , 2026 | 05:23 AM