Share News

‘అవినీతి క్యాన్సర్‌’పై సర్కార్‌ నజర్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 05:27 AM

మెడికల్‌ కార్పొరేషన్‌ అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి వేటు బయో మెడికల్‌ ఇంజనీర్లపై పడింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో...

‘అవినీతి క్యాన్సర్‌’పై సర్కార్‌ నజర్‌

  • మెడికల్‌ కార్పొరేషన్‌లో అవినీతి

  • ఏడుగురు బయో ఇంజనీర్లపై వేటు

  • కొత్త వారిని తీసుకోవాలంటూ ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): మెడికల్‌ కార్పొరేషన్‌ అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి వేటు బయో మెడికల్‌ ఇంజనీర్లపై పడింది. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురిని తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని స్పష్టం చేసింది. కార్పొరేషన్‌లో ఏ ఎక్వి్‌పమెంట్‌ కొనాలన్నా బయో మెడికల్‌ ఇంజనీర్లే కీలకంగా వ్యవహరిస్తారు. దీంతో ఈ కార్పొరేషన్‌లో అవినీతి వీరితోనే ప్రారంభమవుతోంది. వీరికితోడు ఎక్వి్‌పమెంట్‌ విభాగంలోని ఓ కీలక అధికారి కూడా తోడవడంతో వీరి విచ్చలవిడితనానికి అడ్డు అదుపు లేకుండా సాగింది. ఈ వ్యవహారంపై ఆంధ్రజ్యోతి ‘అవినీతి క్యాన్సర్‌’ శీర్షికతో వరుస కథనాలను ప్రచురించింది. బయోమెడికల్‌ ఇంజనీర్లకు 1.5శాతం ఇస్తేనే పని జరుగుతుందని, కీలక అధికారి కూడా వీరు ఉంటేనే ఆ విభాగంలో పనిచేస్తానంటూ ఆరోగ్య శాఖ అధికారులను బెదిరించే వరకూ వారి అవినీతి బంధం ఎదిగిందని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనాల్లో సవివరంగా పేర్కొంది.

3శాతం అధికారి మాటేంటో..!

ఇదే విభాగంలో కోనుగోలు ఉత్తర్వులు(పీవో)లు ఇవ్వాల్సిన అధికారి ఒకరు ప్రతి కొనుగోలుకూ మూడు శాతం ఇవ్వాల్సిందేనంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. బయో మెడికల్‌ ఇంజనీర్లను పంపినట్లుగా ఈయనను పంపుతారా? లేదా? సంస్థ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్న చర్చ నడుస్తోంది.

Updated Date - Jun 02 , 2026 | 05:27 AM