స్వర్ణవార్డు ఉద్యోగులకు పదోన్నతులు
ABN , Publish Date - Sep 28 , 2026 | 02:26 AM
పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగులకు పదోన్నతుల మార్గాన్ని ఖరారు చేసింది. మంత్రివర్గం ఆమోదం మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది
పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లకు మార్గం
815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సృష్టి
1630 గ్రేడ్-2 పోస్టులు.. గ్రేడ్-1గా అప్‌గ్రేడ్
సెలవుల మంజూరు విషయంలో చర్యలు
3,260 మందికి లబ్ధి: మంత్రి నారాయణ
కొందరి ప్రోద్బలంతోనే ‘చలో విజయవాడ’
అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఉద్యోగులకు పదోన్నతుల మార్గాన్ని ఖరారు చేసింది. మంత్రివర్గం ఆమోదం మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో నియమితులై ఆరేళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పలు విభాగాలకు సంబంధించి పదోన్నతులు కల్పించనున్నారు. పదోన్నతుల కోసం 915 మిగులు, ఖాళీ పోస్టులను హేతుబద్ధీకరించి 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. దీనిలో 458 వార్డు అమెనిటీస్ సెక్రటరీ గ్రేడ్-2, 457 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్-2 పోస్టులున్నాయి. దీంతో అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించనున్నారు. తద్వారా ఏర్పడే ఖాళీల ద్వారా వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకూ ప్రమోషన్లు లభించనున్నాయి. వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు, వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీలను గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1గా అప్‌గ్రేడ్ చేశారు.
ఇతర కేటగిరీ ప్రమోషన్లపై పరిశీలన
వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, వార్డు అమెనిటీస్ సెక్రటరీలకు పదోన్నతుల అంశాన్ని సంబంధిత సంక్షేమ, ఇంజనీరింగ్ శాఖల అవసరాలపై గ్రూప్ ఆఫ్ సెక్రటరీల సిఫారసులు అందిన తర్వాత పరిశీలించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా ఈ ఉత్తర్వులతో స్వర్ణవార్డు ఉద్యోగుల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న పదోన్నతి సమస్యకు పరిష్కార మార్గం ఏర్పడనుంది. అలాగే, మున్సిపల్ పరిపాలనలో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సమస్యల పరిష్కారానికి సానుకూలం
స్వర్ణగ్రామ-స్వర్ణవార్డు సిబ్బంది ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ‘‘ఉద్యోగులకు సంబంధించిన పలు డిమాండ్లను సర్కారు ఇప్పటికే పరిష్కరించింది. ప్రభుత్వ చర్యలతో ఉద్యోగులు సంతృప్తిగానే ఉన్నారు. కొందరు పనిగట్టుకుని ఉద్యోగులను ఆందోళనలు, సమ్మెల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్లుపై ఆర్థికశాఖ నివేదిక అనంతరం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. నోషనల్ ఇంక్రిమెంట్లతో ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడనుంది. రూ.150 కోట్ల భారం పడుతున్నా.. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నారు. ఆరేళ్లపాటు ఒకే పోస్టులో పనిచేసిన 1.14 లక్షల మందిలో అర్హులైన వారికి ఏఏఎస్ వర్తిస్తుంది. ఎనర్జీ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, వార్డు హెల్త్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, వ్యవసాయ, ఉద్యాన, సెరీకల్చర్ సహాయకులకు పదోన్నతులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు, వెల్ఫేర్ అసిస్టెంట్లకు మాతృశాఖలో ప్రమోషన్ చానళ్లు ఏర్పాటు చేసింది. సెలవుల సమస్య పరిష్కారానికి ఆటోమేటిక్ క్యాజువల్ లీవ్‌కు ఆమోదం ఇస్తోంది. మరణ ప్రయోజనాలను ఇతర ఉద్యోగులతో సమానంగానే అందిస్తున్నారు. శాఖలో అర్హులైన 121 మందికి కారుణ్య నియామకాలు కల్పించారు. ఉద్యోగులపై పనిభారం పెంచాలనే ఉద్దేశంతో జీవో 11 జారీ కాలేదు.’’ అని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
4 విభాగాలకు ప్రమోషన్
వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు.. జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్/సీనియర్ అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఇవ్వనున్నారు. వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు.. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అసిస్టెంట్/సీనియర్ అకౌంటెంట్, వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ(గ్రేడ్-2)కి గ్రేడ్-1 హెల్త్, శానిటేషన్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతి కల్పిస్తారు.
గ్రేడ్-2లో హెల్త్, శానిటేషన్ అసిస్టెంట్, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ(గ్రేడ్-2)లకు.. గ్రేడ్-1- టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పోస్టులు ఇస్తారు. గ్రేడ్-2-రెగ్యులర్ టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ గ్రేడ్-1కు పదోన్నతి మార్గాలు కల్పించారు. అదనపు భారం లేకుండా.. ఇప్పటికే మంజూరైన పోస్టులను వినియోగించేలా పునర్యవస్థీకరణ చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
పదోన్నతులు వీరికే!
వార్డు పరిపాలన సెక్రటరీలు
డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు
శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు(గ్రేడ్-2) వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ కార్యదర్శులు(గ్రేడ్-2)
ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం
మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై ఆయన స్పందించారు. గతంలో సీసీ రూల్స్, విధివిధానాలను పూర్తి స్థాయిలో పాటించకుండా కొన్ని నియామకాలు జరిగాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రేషనలైజేషన్‌తోపాటు వారికి అందాల్సిన సౌకర్యాలను కల్పించడంపై దృష్టి సారించిందని తెలిపారు. ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలుచేయాల్సిన సమయంలో గత ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, తమ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే, నోషనల్ ఇంక్రిమెంట్స్ వంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేసిన తర్వాత పైఅధికారి నుంచి అనుమతి ఆలస్యమైనా, నిబంధనల మేరకు 2రోజుల క్యాజువల్ లీవ్ మంజూరయ్యే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
మరో 2 కేటగిరీలకు కూడా
స్వర్ణవార్డుల్లో పనిచేస్తున్న నాలుగు కేటగిరీలలోని ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా 3,260 మంది లబ్ధి పొందనున్నారని మంత్రి నారాయణ తెలిపారు. కేబినెట్ ఆమోదంతో ప్రమోషన్ వ్యవహారంపై జీవో 244 జారీచేశామని పేర్కొన్నారు. అధికారుల కమిటీ సిఫారసులు అందిన వెంటనే మిగిలిన మరో రెండు కేటగిరీ ఉద్యోగుల ప్రమోషన్లపై ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.