Share News

ఉద్యోగుల విభజనకు సిద్ధం

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:30 AM

రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా పాత, కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచే ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు స్వీకరిస్తుందని సమాచారం.

ఉద్యోగుల విభజనకు సిద్ధం

  • శాఖల్లో సిబ్బంది కొత్త, పాత జిల్లాల మధ్య విభజన

  • సీనియారిటీ జాబితా ఖరారైన 5 రోజుల్లోగా ఆప్షన్లు

  • ఆదేశాలు వచ్చిన 7 రోజుల్లోగా కొత్త పోస్టుల్లోకి

  • సీనియారిటీ జాబితా, ఆప్షన్లు, అప్పీళ్లు అన్నీ ఆన్‌లైన్లోనే

  • ఉద్యోగుల కేటాయింపుపై జీవో

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా పాత, కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనను పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచే ఉద్యోగుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లు స్వీకరిస్తుందని సమాచారం. ఉద్యోగుల కేటాయింపుల కోసం ఇప్పటికే ప్రత్యేకంగా జిల్లా, జోనల్‌, రాష్ట్ర సచివాలయ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలోని 33 విభాగాలు తమ పరిధిలోని కేడర్‌ విభజన ప్రతిపాదనలు పంపగా ఈ నెల 15నే ప్రభుత్వం వాటిని ఆమోదించింది. ఇక ఆయా శాఖల్లోని సిబ్బందిని కొత్త, పాత జిల్లాల మధ్య విభజించనున్నారు. సీనియారిటీ జాబితాలు రూపొందించి, కొత్త జిల్లాలకు ఉద్యోగుల ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సివిల్‌ పోస్టులను జిల్లా, పొరుగు జిల్లా, జోన్‌, పొరుగు జోన్లు, మల్టీ జోన్‌ కేడర్లుగా పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాల ప్రకారం, వివిధ స్థానిక కేడర్లలో పోస్టుల సంఖ్యను నిర్ధారించి, ఉద్యోగులను ఆయా కేడర్లకు కేటాయించడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేయడానికి ప్రతి శాఖలో మూడంచెల అమలు కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయి కమిటీకి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, కొత్తగా ఏర్పాటైన జిల్లా కలెక్టర్‌ కోచైర్మన్‌గా ఉంటారు. జిల్లా, పొరుగు జిల్లాల కేడర్లలోని ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారు. శాఖాధిపతి స్థాయి కమిటీలకు సంబంధిత శాఖల అధిపతులు చైర్మన్లుగా, జోన్‌ పరిధిలోని పాత, కొత్తగా ఏర్పడిన జిల్లాల స్థాయి శాఖాధిపతులు సభ్యులుగా, జోనల్‌ హెడ్‌/ శాఖాధిపతి సిఫారసు చేసిన ఎవరైనా సీనియర్‌ అధికారి సభ్యుడు/ కన్వీనర్‌గా ఉంటారు.


పాత, కొత్తగా ఏర్పడిన జోన్లు, సరిహద్దు జోన్లలోని అన్ని శాఖల్లోని జోనల్‌, పొరుగు జోనల్‌ కేడర్‌ పోస్టులకు ఉద్యోగులను కేటాయించడం వీరి బాధ్యతగా పేర్కొన్నారు. ఇక సచివాలయ స్థాయి కమిటీల్లో ఆయా శాఖల సెక్రటరీలు చైర్మన్లుగా, ప్రతి మల్టీ జోన్‌ పరిధిలోని జోనల్‌ హెడ్స్‌/ సెక్రటరీ సిఫారసు చేసిన సీనియర్‌ అధికారి సభ్యులుగా, సంబంధిత శాఖాధిపతి కన్వీనర్‌గా ఉంటారు. పాత జిల్లా పరిధిలోని అన్ని పోస్టులను పరిగణనలోకి తీసుకుని కేటగిరీల వారీగా పోస్టుల సంఖ్యను గుర్తిస్తారు. ప్రస్తుతం పాత జిల్లా కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. ఉద్యోగుల కేటాయింపులో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు పాటిస్తారు. పాత జిల్లా కేడర్‌ ఉద్యోగులు కొత్తగా ఏర్పడిన జిల్లాలకు లేదా మిగిలిన పాత జిల్లా ప్రాంతానికి తమ ప్రాధాన్యాలు ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల సీనియారిటీ, ప్రాధాన్యతలు, మార్గదర్శకాల ఆధారంగా జిల్లాస్థాయి అమలు కమిటీ చైర్మన్‌ తుది కేటాయింపు జాబితాను సిద్ధం చేస్తారు. అనంతరం దాన్ని కేటాయింపు ఆదేశాల కోసం సంబంధిత శాఖాధిపతులకు పంపుతారు. జోనల్‌, మల్టీజోనల్‌ కేడర్లలో ఉద్యోగుల పంపిణీ కూడా ఇదే విధానంలో ఉంటుంది. రాష్ట్రస్థాయి పోస్టులు మల్టీజోనల్‌ పోస్టులుగా మారినచోట ఉద్యోగులు రెండు మల్టీజోన్లలో ఒకదానికి తమ ప్రాధాన్యం ఎంచుకోవాలి. ఏ పోస్టు లేదా వ్యక్తి కూడా కేటాయింపులు జరగకుండా మిగిలిపోకూడదు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పోస్టును కావాలని దాచినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు.


సీనియారిటీ జాబితా నిబంధనలు ఇవీ...

సాధారణ పరిపాలన శాఖ జూన్‌ 9న జారీ చేసిన ఆదేశాల ప్రకారం సీనియారిటీ జాబితాను తయారు చేయాలి. 70 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు, సదరం సర్టిఫికేట్‌ ఉన్నవారు, మానసిక దివ్యాంగులైన పిల్లలున్నవారు, పునర్వివాహం చేసుకోని వితంతువులు, కేన్సర్‌, మేజర్‌ న్యూరోసర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగిన ఉద్యోగుల వివరాలు ధ్రువీకరిస్తూ సీనియారిటీ జాబితాలో చేర్చాలి. ఈ జాబితా ఖరారైన వెంటనే సంబంధిత శాఖ వెబ్‌సైట్లో ప్రచురించాలి. ఆ తర్వాత 5 రోజుల్లోగా ఉద్యోగులందరూ తమ ప్రాధాన్యాలు తెలియజేస్తూ, అవసరమైన పత్రాలతో ఈ-మెయిల్‌ ద్వారా వారి ఆప్షన్‌ ఫారాలను కార్యాలయం అధిపతికి సమర్పించాలి. అక్కడినుంచి వాటిని ఉద్యోగుల కేటాయింపుల అమలు కమిటీల చైర్మన్లకు ఈమెయిల్‌ చేయాలి. ఉద్యోగులు ఒక్కసారి ఎంచుకున్న ఆప్షనే అంతిమం. తిరిగి మార్చుకునే అవకాశం లేదు. ఆప్షన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ నుంచి 2 రోజుల ముందుగానే తుది కేటాయింపుల జాబితా విడుదలవుతుంది. ఉద్యోగులకు కేటాయింపు ఆదేశాలు అందాక ఏడు రోజుల్లోగా కొత్త పోస్టుల్లో చేరాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక స్పౌజ్‌ కేసుల కేటాయింపు దరఖాస్తులను కమిటీలు స్వీకరించి ఏడు రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ కేటాయింపులకు సంబంధించి ఉద్యోగులు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. కేటాయింపు ఆర్డర్‌ వచ్చిన ఏడు రోజుల్లోగా ఈ మెయిల్‌ ద్వారా నిర్దేశిత ఫార్మాట్‌లో తమ శాఖ సెక్రటరీ/ హెచ్‌వోడీ/ జిల్లా అధికారికి అప్పీల్‌ చేసుకోవచ్చు. అప్పీల్‌ అందిన ఐదు రోజుల్లోపు సంబంధిత కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. తుదిఉత్తర్వు కూడా ఐదు రోజుల్లోపు జారీ చేస్తారు. ఒకరి అప్పీల్‌ వల్ల మరొక ఉద్యోగికి కేటాయింపు మారే అవకాశం ఉంటే, బాధిత ఉద్యోగికి రెండు రోజుల్లోపు నోటీసు ఇస్తారు. దానికి సమాధానం ఇవ్వడానికి ఐదు రోజుల సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

Updated Date - Jul 18 , 2026 | 04:32 AM