ఒక్క ఉద్యోగమూ పోదు
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:53 AM
ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీలోకి రావడం వల్ల ఏ ఒక్కరికీ ఉద్యోగం పోదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి భంగం కలగదు.
ఈ-బస్సులతో ఇబ్బంది రాదు
పీటీడీ సిబ్బందికి ప్రభుత్వం భరోసా
డిపోలు లీజుకు ఇవ్వట్లేదు.. ప్రైవేటీకరణ లేదు
1050 ఈ-బస్సులకు కేంద్రం ఓకే.. 750 వస్తున్నాయ్
కేంద్రం నుంచి రూ.1,774 కోట్ల ప్రోత్సాహకం
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడి
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీలోకి రావడం వల్ల ఏ ఒక్కరికీ ఉద్యోగం పోదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘ఉద్యోగుల సంక్షేమానికి ఎలాంటి భంగం కలగదు. డిపోలను లీజుకు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 1,050 ఈ-బస్సులకు ఆమోదం తెలిపింది.. 750 బస్సులు రెండు నెలల్లో వస్తాయి. మరో 300 మార్చిలో రాబోతున్నాయి. జీసీసీ ద్వారా మన రాష్ట్రానికి రూ.1,774 కోట్ల ప్రోత్సాహకం లభిస్తోంది.’’ అని వివరించింది. ఇకపై అన్నీ విద్యుత్ బస్సులే ప్రవేశ పెట్టాలని ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం సంస్థ మనుగడకు ముప్పు అంటూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పాటై నిరసనలు చేపడుతున్నాయి. ఈ-బస్సులను ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేసి సిబ్బంది నియామకాలు చేపట్టి ప్రయాణ సేవలు అందించాలని ఉద్యోగ సంఘాలు జేఏసీ కోరుతోంది. ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించొద్దని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న జేఏసీ నేతలతో చర్చలు జరిపి ఆర్టీసీ ఉన్నతాధికారులు తీసుకున్న అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సమగ్ర వివరణ ఇచ్చింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సచివాలయంలో దీనిపై విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆర్టీసీలో ఎనిమిది వేల సొంత బస్సులు, 2,650 అద్దె బస్సులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ విధానం మేరకు 2029 నాటికి మొత్తం ఫ్లీట్‌ను దశలవారీగా విద్యుత్ బస్సులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని గ్రాస్ కాస్ట్ కటింగ్(జీసీసీ) విధానంలో ప్రవేశ పెట్టేందుకు కేంద్రం చేయూత అందిస్తోంది.. బ్యాటరీ టెక్నాలజీ స్థిర పడక పోవడం, ఒక్కో బస్సు ధర రూ.1.50కోట్ల వరకూ ఉండటం, సాంకేతిక అవసరాల దృష్ట్యా ఈ విధానం అవలంబిస్తున్నాం.
ఇప్పటికే తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదన పల్లెకు ఈ-బస్సులు తిరుగుతున్నాయి.. అక్కడ ఒక్క ఉద్యోగం కూడా తీసెయ్యలేదు. అజమాయిషీ అంతా ఆర్టీసీ పరిధిలోనే ఉంటుంది. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ సొంతంగా బస్సులు కొనాలంటే బడ్జెట్ సహకరించాలి. పర్మినెంట్ ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే ప్రజలపై భారం వేయాల్సి వస్తుంది. అందుకే తక్కువ ఖర్చుతో ప్రజలకు ప్రయాణ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’’ అని ఆయన వివరణ ఇచ్చారు. బస్ డిపోలు లీజుకు ఇవ్వడం లేదని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో అన్నీ విద్యుత్ బస్సులు ప్రవేశ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిల్లబోదని, భవిష్యత్తులో మిగులు డ్రైవర్లకు ఉపాధి కల్పించేలా ’డ్రై లీజ్’ విధానాన్ని అమలు చేసే ఆలోచన ఉందని కృష్ణబాబు స్పష్టం చేశారు.