Share News

శుద్ధి చేసి వాడుకుందాం!

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:48 AM

నీటి కొరతను అధిగమించడం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా మురుగునీటి రీసైక్లింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

శుద్ధి చేసి వాడుకుందాం!

  • పట్టణాల్లో మురుగునీటి రీసైక్లింగ్‌పై ప్రభుత్వం దృష్టి

  • వాడుక నీటి పునర్వినియోగం విధానానికి ఆమోదం

  • ఎన్జీటీ ఆదేశాల మేరకు పాలసీ రూపకల్పన

  • పట్టణ అవసరాల్లో 20 శాతం శుద్ధి చేసిన నీటితో భర్తీ

  • తాగునీటికి కాకుండా ఇతర అవసరాలకు వాడకం

  • పాలసీలో 14 లక్ష్యాలు.. వ్యవసాయానికి ప్రాధాన్యం

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): నీటి కొరతను అధిగమించడం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా మురుగునీటి రీసైక్లింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికోసం శుద్ధిచేసిన వాడుక నీటి పునర్వినియోగ విధానం-2026కు గురువారం ఆమోదం తెలిపింది. మురుగునీటిని శుద్ధి చేసి తాగునీటి కోసం కాకుండా... వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణం, పట్టణ హరితాభివృద్ధి వంటి రంగాల్లో వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నీటి అవసరాలు, తగ్గుతున్న మంచినీటి లభ్యత నేపథ్యంలో శుద్ధి చేసిన మురుగునీటిని ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. శుద్ధి చేసిన నీటిలో నత్రజని, భాస్వరం, గంధకం వంటి పోషకాలు ఉండటంతో వ్యవసాయ భూముల సారాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రసాయన ఎరువుల వినియోగం కొంత వరకూ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.


ఎన్‌జీటీ ఆదేశాల అమలు...

కాలుష్యానికి గురైన నదుల పునరుద్ధరణపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఇచ్చిన ఆదేశాల అమల్లో భాగంగానే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శుద్ధిచేసిన మురుగునీటిని నదులు, చెరువులు, సరస్సుల్లోకి విడుదల చేయకుండా ప్రత్యామ్నాయ వినియోగాలకు మళ్లించడం ద్వారా నీటి వనరుల కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. స్వర్ణాంధ్ర విజన్‌-2047లో భాగమైన నీటి భద్రత, స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనకు ఈ విధానం తోడ్పడనుందని చెప్పింది. శుద్ధిచేసిన నీటిని ఆర్థిక వనరుగా మలచడం, పునర్వియోగం ద్వారా నీటి వృథాను అరికట్టడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడించింది.


దశల వారీగా పెంచాలని నిర్ణయం..

మంచినీటి వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం, వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగం పెంపు, అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే మురుగునీటిలో 100 శాతం ప్రయోజనకర పునర్వినియోగం, జలవనరుల కాలుష్య నియంత్రణ, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పీపీపీ విధానంలో పెట్టుబడుల ఆకర్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే సామర్థ్యం పెంపు వంటి 14 లక్ష్యాలను ఈ పాలసీలో నిర్దేశించారు. పట్టణ స్థానిక సంస్థల నీటి అవసరాల్లో కనీసం 20 శాతం శుద్ధి చేసిన జలాల ద్వారా తీర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి 20, 2028 నాటికి 40 శాతం.., 2029 నాటికి 90 శాతం పట్టణ స్థానిక సంస్థల్లో శుద్ధిచేసిన నీటిని వినియోగించేలా చేయాలని నిర్ణయించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, 10 కేఎల్‌డీ కంటే ఎక్కువ నీరు వినియోగించే పరిశ్రమలు, కార్‌వాష్‌ కేంద్రాలు, నిర్మాణ ప్రాజెక్టులు, రైల్వేయార్డులు, బస్సు డిపోలు, పోర్టులు, పార్కులు, ఉద్యానవనాలు, రోడ్ల శుభ్రత వంటి పట్టణ సేవల్లో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని తప్పనిసరి చేసింది. కొత్త టౌన్‌షి్‌పలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో డ్యూయెల్‌ పైపింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.


ప్రతి ఏటా లభ్యత ప్రకటించాలి..

రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు తమ పరిధిలో లభించే శుద్ధి చేసిన నీటి పరిమాణం, నాణ్యత, ఎస్‌టీపీ సామర్థ్యం, సరఫరా ప్రాంతాల వివరాలను ప్రతి ఏడాది మార్చి 31లోగా ప్రకటించాల్సి ఉంటుంది. భారీ వినియోగదారులు సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసి నీటి కేటాయింపులు పొందాల్సి ఉంటుంది. మొత్తంగా శుద్ధిచేసిన మురుగు నీటిని విలువైన వనరుగా మార్చడం ద్వారా... నీటి భద్రత, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో వినియోగించడమే ఈ విధానం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

వ్యవసాయానికి ప్రాధాన్యం..

వ్యవసాయాన్ని ప్రాధాన్యరంగంగా గుర్తిస్తూ... పత్తి, నూనె గింజలు, ధాన్యాలు, పశుగ్రాసం, బయోఫ్యూయెల్‌ పంటలు, అటవీ మొక్కల సాగుకు శుద్ధిచేసిన నీటిని వినియోగించవచ్చని పేర్కొంది. అయితే పచ్చిగా తినే ఆకుకూరలు, వేరుజాతి కూరగాయలు, సలాడ్‌లలో ఉపయోగించే పంటలకు ఈ నీటిని వాడొద్దని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో శద్ధి చేసిన మురుగునీటిని తాగునీరుగా ఉపయోగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం, ప్రజల ఆమోదం, నియంత్రణ సంస్థల అనుమతుల ఆధారంగా దీనిపై సమీక్ష చేపట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

Updated Date - Jun 26 , 2026 | 04:50 AM