మూలనపడ్డ 108ల విక్రయానికి అనుమతి
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:21 AM
రాష్ట్రంలో మూలనపడ్డ 291 అంబులెన్సులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇ-ఆక్షన్‌కు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూలనపడ్డ 291 అంబులెన్సులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇ-ఆక్షన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. మెంబర్ కన్వీనర్‌గా అడిషనల్ సీఈవో, 108 నోడల్ ఆఫీసర్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, ఆర్టీసీ నుంచి డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, నలుగురు అసిస్టెంట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్లను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ ప్రత్యేక నిబంధనలు, పద్ధతులను పాటిస్తూ ఇ-ఆక్షన్ ద్వారా మూలనపడ్డ 108 అంబులెన్స్‌లను విక్రయించాలని ఆదేశించింది. అనంతరం పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.