కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి
ABN , Publish Date - Apr 07 , 2026 | 04:06 AM
రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా-సెషన్స్ జడ్జిస్థాయి కోర్టులు 12, సివిల్‌జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి.
1730 మంది నూతన సిబ్బంది కూడా.. న్యాయశాఖ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా-సెషన్స్ జడ్జిస్థాయి కోర్టులు 12, సివిల్‌జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా-సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి చేరనుంది. అలాగే సివిల్‌జడ్జి(సీనియర్ డివిజన్) కేడర్ స్ట్రెంత్ ప్రస్తుతం 138 ఉండగా, అదనంగా కేటాయించిన 25తో కలిపి సంఖ్య 163కు చేరనుంది. సివిల్‌జడ్జి(జూనియర్ డివిజన్) సంఖ్య 329 ఉండగా అదనంగా కేటాయించిన 59తో కలిపి ఆ సంఖ్య 388కి చేరనుంది. మరోవైపు కొత్తగా ఏర్పాటు కానున్న కోర్టుల్లో సిబ్బంది నియామకం నిమిత్తం 1730 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టులో 21 మంది, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 19మంది, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో 17మంది చొప్పున ఒక్కో కోర్టుకు నియామకం కానున్నారు. న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా వచ్చే జిల్లా జడ్జి కోర్టులు ఇవీ..: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లా ప్రొద్దుటూరు, గాజువాక, నర్సీపట్నంలలో ఒక్కో కోర్టు, అలాగే, విశాఖనగరంలో మరో 4 కొత్త కోర్టులు ఏర్పాటు కానున్నాయి.
సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) కోర్టులు ఏ జిల్లాకు ఎన్నంటే...: అనంతపురం 3, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, కర్నూలు 2, కృష్ణా 6, నెల్లూరు 1, విశాఖ 6, పశ్చిమగోదావరి 3, కడప 1
సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులు ఏ జిల్లాకు ఎన్నంటే...: అనంతపురం 14, చిత్తూరు 6, తూర్పుగోదావరి 3, గుంటూరు 2, కృష్ణా 3, కర్నూలు 17, ప్రకాశం 7, శ్రీకాకుళం 1, విశాఖ 2, పశ్చిమగోదావరి 4