Share News

మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం

ABN , Publish Date - Sep 28 , 2026 | 06:59 AM

ఇటీవలి తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర ఖర్చుల కోసం 12 ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసింది. వాయుగుండానికి ప్రభావితమైన బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం
FISHER

  • ఒక్కో వ్యక్తికి 1,000.. కుటుంబానికి 3,000

  • ఉచితంగా నిత్యావసర సరుకులు కూడా

  • వరద బాధితులకు సర్కారు ఆపన్నహస్తం

  • 12 జిల్లాల కలెక్టర్లకు రూ.16 కోట్లు విడుదల

అమరావతి, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఇటీవలి తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర ఖర్చుల కోసం 12 ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసింది. వాయుగుండానికి ప్రభావితమైన బాధిత కుటుంబాలకు నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొంది, తిరిగి ఇళ్లకు వేళ్లేటప్పుడు ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి లేదా కుటుంబానికి గరిష్ఠంగా రూ.3వేలు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లు, అత్యవసర ఖర్చుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, అల్లూరిజిల్లాలకు రూ.2కోట్లు చొప్పున, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు చేసింది. భారీ వర్షాలు, వరదలు సంభవించిన జిల్లా కలెక్టర్లు ఈ నిధులు వాడుకోచ్చని పేర్కొంది. ఈ నిధులను వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి వైద్య శిబిరాల నిర్వహణ, పారిశుధ్యం, రోడ్లు, సాగునీటి మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతులకు వినియోగించాలని స్పష్టం చేసింది. 30 రోజుల్లో ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్దేశించింది.

Updated Date - Sep 28 , 2026 | 06:59 AM