Share News

మూడు కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 05:21 AM

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మూడు కంపెనీలకు కోట్లాది రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మూడు కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

  • వేల కోట్ల రాయితీలు... దశల వారీ రీయింబర్స్‌మెంట్లు

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మూడు కంపెనీలకు కోట్లాది రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఆయా శాఖల అధిపతులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోండెలెజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహిస్తున్న చాక్లెట్‌ ఉత్పాదక యూనిట్‌ విస్తరణ కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. మొత్తం రూ.1801 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ను విస్తరించి 80 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే ఈ పరిశ్రమకు ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ (4.0) కింద వివిధ రూపాల్లో మొత్తం రూ.1,111.81 కోట్లు రాయితీ, రీయింబర్స్‌మెంట్‌ రూపంలో ప్రభుత్వం అందించనుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అవెరాన్‌ ప్యానెల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1137.58 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఉడ్‌ ప్యానెల్స్‌ తయారీ ప్రాజెక్టుకు ఇప్పటికే గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 106 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీకి రాయితీలు, రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.867.81 కోట్లు ప్రోత్సాహకాలను ఇస్తోంది. కాకినాడ వద్ద ఎస్‌ఏఎఫ్‌ వన్‌ ఇండియా ఎస్‌పీ కాంపాక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1356.22 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫల్డ్‌ సస్టెయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ (ఎస్‌ఏఎఫ్‌) తయారీ ప్లాంట్‌కు ఏపీ మ్యారిటైం బోర్డు (ఏపీఎంబీ)కి చెందిన 45 ఎకరాలను 30ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించింది. వివిధ రూపాల్లో ఈ కంపెనీకి రూ.1,203.8 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Updated Date - Jul 12 , 2026 | 05:22 AM