గిరిజన ప్రాంతాల్లో 2500 కోట్లతో రోడ్లు
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:20 AM
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
44 వేల అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు
20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ
జగన్‌కు టీచర్లంటే పడ దు..: మంత్రి సంధ్యారాణి
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రూ.2500 కోట్లతో రహదారులు నిర్మిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే గిరిశిఖర గ్రామాల్లో దారి లేని చోట్ల మట్టి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే ఫార్మేషన్ రోడ్ల కోసం రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలకు ముగింపు పలకడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు దశలవారీగా ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ చేపట్టామని, దీనివల్ల ఇంధన పొదుపు, పరిశుభ్రత సాధ్యమవుతుందని అన్నారు. తొలి విడతలో 11,400 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు.
డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం
టీచర్ ఉద్యోగాలు తీసేయడానికి అవి జగన్ నియమించిన వలంటీర్ పోస్టులు కాదని... నిబంధనల ప్రకారం నియామకాలు జరిగాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. జగన్ భయపట్టే రాజకీయాలకు ఎప్పుడో కాలం చెల్లిందని, మెగా డీఎస్సీ ద్వారా 2 వేల మంది ఎస్టీలకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఉపాధ్యాయులంటే జగన్‌కు ముందు నుంచే సరిపడదన్నారు. అందుకే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల ముందు, టాయిలెట్ల దగ్గర టీచర్లను కాపలా పెట్టి, ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గానికో, కులానికో ప్రత్యేక ప్రయోజనం కల్పించలేదని... ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులకు వర్తించే రిజర్వేషన్లను నిబంధనల ప్రకారమే అమలు చేశామని చెప్పారు.