Share News

అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - May 22 , 2026 | 04:13 AM

దశాబ్దాలుగా అసైన్డ్‌ ఇంటి స్థలాలు కలిగిన పేదలకు మేలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు గడువు తీరిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్నీ పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది.

అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌

  • క్రయ విక్రయాలకు అనుమతిస్తారు

  • తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు

  • రిజిస్ర్టేషన్‌కు పట్టా, పన్ను రశీదు చాలు

  • రిజిస్ట్రేషన్‌ పూర్తైన 90 రోజుల తర్వాతే లావాదేవీలకు అవకాశం

  • మార్గదర్శకాలు జారీ.. లక్షల మందికి మేలు

  • త్వరలో రెండేళ్లకు హక్కులు కల్పిస్తాం

  • 1.9 లక్షల చుక్కల భూములకూ విముక్తి

  • రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దశాబ్దాలుగా అసైన్డ్‌ ఇంటి స్థలాలు కలిగిన పేదలకు మేలుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదేళ్లు గడువు తీరిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్నీ పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ గురువారం మార్గదర్శకాలు విడుదల చేశారు. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అందులో వివరించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది మంది పేదలకు పూర్తిస్థాయి శాశ్వత ఇంటిహక్కులు లభించనున్నాయి. లబ్ధిదారుకు ఇంటి స్థలం అసైన్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వు, ఇంటి పట్టాతోపాటు, ఇంటి పన్ను చెల్లించిన రశీదు ఉంటే చాలు రిజిస్ట్రేషన్‌ చేయాలని స్పెషల్‌ సీఎస్‌ ఆదేశించారు. అయితే, ఆ ఇంటిపట్టా లబ్ధిదారు పేరిట ఉండాలి. అందులో లబ్ధిదారుడే పొజిషన్‌లో ఉండాలి. ఇంటిస్థలం రిజిస్ట్రేషన్‌ అయిన 90 రోజుల తర్వాత దా నిపై క్రయ, విక్రయాలకు అవకాశం ఉంటుంది. అంటే, లబ్ధిదారు పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ పొందిన 90 రోజుల తర్వాత, తిరిగి ఆ ఇంటిని అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు.


మార్గదర్శకాల్లో కీలకమైనవి..

1) ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం-1977 ప్రకారం, పేదలకు అసైన్డ్‌ చేసిన ఇంటి స్థలాలు ఇతరులకు బదిలీ చేయకూడదన్న నిబంధన మొదట్లో ఉండేది. అయితే సవరించిన చట్టంలోని సెక్షన్‌ 3(2ఏ), సెక్షన్‌ 3(2బి) ప్రకారం అసైన్‌చేసిన పదేళ్ల కాలం దాటాక ఆ భూములను అసైనీల పేరిటే రిజిస్ట్రేషన్‌ చెయ్యాలి. ఆ తర్వాత పేదలకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి. కాబట్టి, తమ వ్యక్తిగత అవసరాలకు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ఇంకా అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు.

2) అసైన్డ్‌ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం లబ్ధిదారు తనకు ఇచ్చిన అసైన్‌మెంట్‌ పట్టా, ఉత్తర్వును రిజిస్ట్రేషన్‌ అధికారికి సమర్పించాలి. వీటితోపాటు ఇంటిపన్ను చెల్లింపు రశీదులను సమర్పించాలి.

3) అసైన్డ్‌ ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చినప్పుడు ఆ భూమి అసైన్‌మెంట్‌ చేసిన కాలపరిమితి పదేళ్లు దాటిందా? లేదా అన్నది నిర్ధిష్టంగా నిర్ధారించుకోవాలి. పదేళ్ల కాలపరిమితి దాటిన వాటికే రిజిస్ట్రేషన్‌ వర్తిస్తుంది.

4) నిర్దిష్ట సర్వే నంబర్‌లో ఉన్న ప్లాట్‌ నంబర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి.

5) రిజిస్ట్రేషన్‌ సమయంలో అసైనీదారు నిజమైన లబ్ధిదారా? కాదా? అన్నది అధికారి పరిశీలించాలి. ఒక వేళ అసలు లబ్ధిదారు మరణించిన పక్షంలో, వారి వారసులు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చినప్పుడు అసలు పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, ఇంకా ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి.


6) పదేళ్లు గడువు తీరిన అసైన్డ్‌ ఇంటి స్థలం నిషేధ జాబితాలో ఉన్నా, అందులో ఇంటి నిర్మాణం అయి ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి.

7) గతంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీమ్‌ (ఓటీఎస్‌) కింద రెగ్యులరైజ్‌ అయినవాటిని, ఇంచుమించు ఇలాంటి స్కీమ్‌ల పరిధిలో రెగ్యులరైజ్‌ అయిన ఇళ్లను కూడా అసలు హక్కుదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలి. సంబంధిత భూములు నిషేధ జాబితాలో ఉన్నా వాటిని రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలి.

8) రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 90రోజుల తర్వాత చట్టప్రకారం లావాదేవీలకు అస్కారం ఉంటుంది. అంటే, ఆ గడువు తీరాక పేదలు ఆ ఇంటిని అమ్ముకోవచ్చు. ఇతరులు కొనుగోలు చేయవచ్చు.

9) ప్రభుత్వం నిర్దేశించిన డాక్యుమెంట్లు మినహా అదనంగా మరే పత్రాల కోసం అసైనీలపై ఒత్తిడి తీసుకురావద్దు.

10) ఫేక్‌పట్టాలు, నకిలీ ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్‌ చేయమన్నవారిపై రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్లు 82,83 ప్రకారం సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.


త్వరలో రెండేళ్లకే హక్కులు: అనగాని

పేదలకు మేలు చేసేందుకే అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు అనుమతించామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. త్వరలో రెండేళ్లకే హక్కులు కల్పించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘పేదలకు ఇచ్చే అన్ని రకాల ఇంటి స్థలాలపై రెండేళ్లకే హక్కులు కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తాం. తొలిదశలో 1.9లక్షల ఎకరాల చుక్కల భూములకు నిషేధ విముక్తి కల్పిస్తాం. ఇప్పటికే 1.6లక్షల ఎకరాల సర్వీస్‌ ఇనామ్‌, షరతుగల పట్టా భూములకు విముక్తి లభించింది. పట్టణ ప్రాంతాల్లో 10 వేల గృహలను క్రమబద్ధీకరిస్తాం’’ అని మంత్రి వివరించారు.

Updated Date - May 22 , 2026 | 04:15 AM