సర్వ హక్కులూ!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:30 AM
పర్యాటక, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించే భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూములు సంబంధిత పరిశ్రమకు కేటాయించినప్పటికీ...
ప్రాజెక్టులకు భూ కేటాయింపులపై కీలక నిర్ణయం
గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు
రాయితీ/మార్కెట్ విలువకు కేటాయిస్తే నిర్వహణ హక్కులు ప్రభుత్వానివే!
22ఏ జాబితాలోనే సంబంధిత భూములు
ఇప్పుడు.. కంపెనీలకు నేరుగా అమ్మేయవచ్చు
నిషేధ జాబితాలో లేకుండా నిబంధనలు సడలింపు
పర్యాటకంతోపాటు అన్ని భూకేటాయింపులకు అమలు
2024 జూలై 1 తర్వాత జరిగిన వాటికి వర్తింపు
జీవో 395 జారీ చేసిన రెవెన్యూ శాఖ
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పర్యాటక, పరిశ్రమలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు కేటాయించే భూముల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూములు సంబంధిత పరిశ్రమకు కేటాయించినప్పటికీ... వాటి యాజమాన్య/నిర్వహణ హక్కులు మాత్రం ప్రభుత్వం వద్దే ఉండేవి. ఇప్పుడు... ఆ భూములను సంబంధిత ప్రాజెక్టు యాజమాన్యానికే ‘సేల్’ చేసే అవకాశం కల్పించారు. అంటే... ఆ భూమిపై పూర్తి హక్కులు సంబంధిత యాజమాన్యానివే! 2024 జూలై 1 తర్వాత నుంచి కేటాయించిన భూములకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ‘‘టూరిజం, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం కేటాయించే భూములను నేరుగా డెవలపర్‌లకు లీజు రూపంలో ఇవ్వొచ్చు. లేదా... అమ్మేయవచ్చు. ఆ మేరకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని మార్గదర్శకాలు, వాటి నిబంధనలను సడలించి లీజు, అమ్మకం ఒప్పందాలను రిజిస్ట్రేషన్ చేయవచ్చు. భూ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వారం రోజుల్లోనే డేటాను రిజిస్ట్రేషన్ శాఖ చూసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా వెబ్‌ల్యాండ్‌లో ఏర్పాట్లు చేయాలి’’ అని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జి.సాయిప్రసాద్ మంగళవారం జీఓ 395 జారీ చేశారు.
ఇప్పటిదాకా ఇలా... పరిశ్రమలు, కంపెనీలు నెలకొల్పుతున్న సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించడం సహజం. ఆయా కంపెనీల స్వభావం, పెట్టే పెట్టుబడి, ఉపాధి కల్పన స్థాయిని బట్టి... ఉచితంగా, రాయితీ ధరకు, ఇంకా కనీస విలువ ఆధారంగా లేదా మార్కెట్ విలువకు భూములు కేటాయిస్తున్నారు. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో విడుదలైన భూ కేటాయింపు పాలసీ ప్రకారం ఈ కేటాయింపులు జరుగుతున్నాయి. కంపెనీలకు మార్కెట్ ధర ప్రకారం భూములు కేటాయించినా ఉచితంగా ఇచ్చినా... యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దనే ఉంటున్నాయి. వాటిని నిషేఽధ జాబితా 22(ఏ)లోనే ఉంచుతారు. అంటే.. ప్రభుత్వం నుంచి పొందిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉండదు. కంపెనీలు ఆ భూములను తనఖా పెట్టి రుణాలు తీసుకోవాలంటే... ప్రభుత్వ అనుమతి తప్పదు. ఇదీ ఇప్పటిదాకా ఉన్న విధానం!
ఎప్పటి నుంచో డిమాండ్లు... మార్కెట్ ధరకు తీసుకున్న భూములను తమ పేరిటే రిజిస్ట్రేషన్ చేయాలని, తమకు పూర్తి హక్కులు కల్పించాలని కంపెనీలు సుదీర్ఘకాలంగా కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. అయితే, టూరిజం ప్రాజెక్టుల విషయంలో మాత్రం విభిన్న పరిస్థితి నెలకొంది. పర్యాటక ప్రాజెక్టులకు టూరిజం కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భూములు కేటాయిస్తోంది. ప్రాజెక్టు డెవలపర్‌గా తమకు ఇస్తున్న భూములపై పూర్తి హక్కులు ఉండాలని కంపెనీలు పట్టుబడుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఏపీటీడీసీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది.
అమ్మకానికి ఓకే.... పర్యాటక శాఖ విన్నపంపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే... టూరిజం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్‌ల పరిధిలోని భూ కేటాయింపులనూ కలిపేసింది. ప్రాజెక్టు డెవలపర్‌లకు భూమిని లీజు ఇస్తుంటే ఆ మేరకు అగ్రిమెంటు కుదుర్చుకోవాలి. రాయితీ ధర/బేసిక్ విలువ/మార్కెట్ విలువకు భూములు ఇచ్చినట్లయితే... వాటి పేరిటే హక్కులు(సేల్) ఇవ్వాలని నిర్ణయించింది. అంటే.. ఆ భూములను సదరు కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసేందుకు రెవెన్యూ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ మేరకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని మార్గదర్శకాలు, నిబంధనలను సడలించాలని రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది.
దీనివల్ల ఏమవుతుంది? జగన్ హయాంలో అస్మదీయ కంపెనీలకు విచ్చలవిడిగా భూ కేటాయింపులు జరిగాయి. కారుచౌకగా భూములు తీసుకున్నవారిలో కొందరు... వాటిని బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాలు తీసుకున్నారు. పరిశమ్రలూ పెట్టలేదు. భూయాజమాన్య హక్కులు ప్రభుత్వ పరిధిలో ఉంటేనే ఇదీ పరిస్థితి. మరి... పూర్తిగా కంపెనీలకే ‘సేల్’ చేసి, హక్కులు బదలాయిస్తే ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ‘మార్కెట్ ధరకు కొంటున్నాం కదా’ అని కంపెనీలు వాదించవచ్చు. కానీ... బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరతో పోల్చితే అది నామమాత్రమే! కారుచౌకగా భూములు సొంతం చేసుకోవడమే. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేసినప్పటికీ... కేటాయించిన అవసరాలకే ఆ భూమిని ఉపయోగిస్తున్నారా? కొంత భూమిని తిరిగి విక్రయించుకున్నారా? తనఖా పెట్టేశారా? ఇలాంటివేవీ ప్రభుత్వం దృష్టికివచ్చే అవకాశం లేదు. సర్వ హక్కులూ ఆ కంపెనీవే కావడంతో దీనిపై నియంత్రణా ఉండదు.