సీపీఎస్ ఉద్యోగులకు ఓపీ‘ఎస్’
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:13 AM
అర్హత ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించింది. 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది.
10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం
2004 సెప్టెంబరు 1కి ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత విధుల్లో చేరినవారికి వర్తింపు
వన్ టైమ్ ఆప్షన్ ఇస్తూ ప్రభుత్వ జీవో
నాడు పోస్టింగ్‌లు ఇవ్వడంలో వైఎస్ జాప్యం
2019 ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన జగన్
అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించింది. 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది. వీరిలో 6,500 మంది ఉపాధ్యాయులు కాగా, మిగిలినవారు పోలీసు, ఇతర శాఖల ఉద్యోగులు ఉన్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు జీవో జారీ చేసింది. 2004 సెప్టెంబరు 1 కంటే ముందు జారీ అయిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ద్వారా ఆ తేదీన లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయడమే ఈ జీవో ఉద్దేశం. జీవో వచ్చిన నాటి నుంచి 3 నెలల్లోగా ఉద్యోగులు నిర్ణీత నమూనాలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇది వన్ టైమ్ ఆప్షన్ అని స్పష్టం చేసింది. ఒక సారి ఆప్షన్ ఎంచుకుంటే తిరిగి మార్చుకోవడం, వెనక్కి తీసుకోవడం కుదరదని వెల్లడించింది. ప్రభుత్వం మరోసారి ఈ అవకాశం కల్పించదు.
జీవోలో వివరాలు
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) ఎంచుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు.
ఫ ఏపీ ప్రభుత్వం 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది.
కేంద్ర ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కొన్ని నిర్దిష్ట పరిస్థితుల వల్ల నియామకాలు ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు ఒకేసారి అవకాశం ఇచ్చింది.
ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో కూడా 2004 సెప్టెంబరు 1 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన అర్హులైన ఉద్యోగులకు ఓపీఎస్ పరిధిలోకి మారేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఓపీఎస్‌లోకి మారేందుకు అర్హత ఉండి ఆప్షన్ ఇవ్వనివారు యథావిధిగా సీపీఎస్ పరిధిలోనే కొనసాగుతారు.
ఈ ఉత్తర్వుల అమలు, సీపీఎస్ కార్పస్ నిర్వహణకు సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ట్రెజరీస్, అకౌంట్స్ డైరెక్టరేట్‌కు విడిగా జారీ చేస్తుంది.
నాడు వైఎస్ జాప్యం..
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2003లో పలు నోటిఫికేషన్లు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా పూర్తి చేశారు. అయితే వివిధ సాంకేతిక, పరిపాలనాపరమైన, న్యాయపరమైన కారణాల వల్ల భర్తీ ప్రక్రియలో ఉద్యోగుల పోస్టింగులు ఆలస్యమయ్యాయి. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఆ నియామకాలు జరిగితే క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే ఉద్దేశంతో నాటి వైఎస్ సర్కారు కావాలనే జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడంలో ఏడాది, రెండేళ్ల పాటు ఆలస్యం జరిగింది. ఈలోపే వైఎస్ ప్రభుత్వం 2004లో సీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. దీంతో పాత నోటిఫికేషన్ల మేరకు ఓపీఎస్‌కు అర్హత ఉన్న 10,715 మంది సీపీఎస్‌లోకి వచ్చేశారు.
మాట తప్పిన జగన్
2019 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని, 10,715 మంది సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మార్చేస్తామని ఊరువాడా ప్రచారం చేశారు. కానీ సీఎం అయ్యాక ఈ హామీ విస్మరించారు. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో రెండు సార్లు నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చింది. అయినా ఆయన పట్టించుకోలేదు. అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగులకు మేలు చేయలేదు. దేశవ్యాప్తంగా ఉన్న సీపీఎస్ సమస్యపై 2020 ఫిబ్రవరి 17వ తేదీన కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీనిపై ఓఎం 57ను విడుదల చేసింది. దీని ప్రకారం సీపీఎస్ అమలు(2004 సెప్టెంబరు 1)కు ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడి, ఫలితాలు కూడా వెల్లడై, నియామకం మాత్రం ఆలస్యమైన వారందరికీ ఓపీఎ్‌సను వర్తింపజేయాలి. ఈ విధానం అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ సూచించింది. కానీ నాటి జగన్ సర్కార్ దీన్ని పట్టించుకోలేదు. 2023లో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఇదే అంశంపై స్పష్టత ఇచ్చింది. అప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదు.