గిరిజన ప్రాంతాల్లోని భూ వివాదాల సెటిల్‌మెంట్ అధికారం సర్వే డైరెక్టర్‌కే
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:13 AM
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో భూముల కేసుల సెటిల్‌మెంట్ అధికారాన్ని సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐటీడీఏ పీవోల అధికారం ఉపసంహరణ
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో భూముల కేసుల సెటిల్‌మెంట్ అధికారాన్ని సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు (జీఓ337) జారీ చేశారు. ఇప్పటి వరకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ల వద్ద ఉన్న ఈ అధికారాలను(జీఓ 1001ను) ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇకపై షెడ్యూల్డ్ ఏరియాల్లోని భూ వివాదాలు, సెటిల్‌మెంట్ల కేసులను కూడా సర్వేసెటిల్‌మెంట్ డైరెక్టరే చూడనున్నారు. 2008లో జారీ అయిన జీఓ 1001 అమలుపై ఉమ్మడి రాష్ట్రంలోనే హైకోర్టులో పిల్స్, రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. 2009 నుంచి 2011 దాకా అనేక పిల్స్ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 2023లోనే జీఓ 1001ని ఉపసంహరించుకుంది. అంటే, ఐటీడీఏ పీఓలకు ఇచ్చిన అధికారాల బదలాయింపును ఉపసంహరించుకుని, ఆ అధికారాన్ని ఆ రాష్ట్ర, సర్వే, సెటిల్ మెంట్ డైరెక్టర్‌కే అప్పగించింది. ఈ అంశంపై మన రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక చర్చలు జరిగాయి. ఇదే అంశంపై పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టత కోరారు. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా జీఓ 1001ను ఉపసంహరించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) జి.జయలక్ష్మి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ స్పందించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కూడా భూముల వివాదాలు, సెటిల్‌మెంట్స్, అప్పీల్స్ వంటి అధికారాలను ఐటీడీఏ పీఓ నుంచి ఉపసంహరించి, తిరిగి సర్వేసెటిల్‌మెంట్ డైరెక్టర్‌కు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.