Share News

ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌: హోంమంత్రి

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:45 AM

రాష్ట్రంలో సైబర్‌ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. 1930 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి....

ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌: హోంమంత్రి

రాష్ట్రంలో సైబర్‌ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. 1930 హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి, సైబర్‌ నేరాల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. శాసనమండలిలో సైబర్‌ నేరాల నియంత్రణపై టీడీపీ సభ్యులు గ్రీష్మ, రాంగోపాల్‌రెడ్డి, బీటీనాయుడు, జనసేన సభ్యుడు నాగేంద్రబాబు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు. ‘డిజిటల్‌ అరెస్టులు చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ప్రయత్నిస్తే.. 1930కు ఫోన్‌ చేయండి. పోలీసులు అప్రమత్తమై, మీ వద్దకు వస్తారు. సైబర్‌ నేరాల నివారణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోషల్‌ మీడియాపై కూడా ప్రత్యేక జీవో తెచ్చాం. మంత్రుల బృందంతో కమిటీ వేశాం. సోషల్‌ మీడియా ప్రభావం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తాం’ అని చెప్పారు. తొలుత సైబర్‌ నేరగాళ్ల అరాచకాలు మితిమీరుతున్నాయని చైర్మన్‌ మోషేన్‌రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Feb 14 , 2026 | 02:45 AM